ఘాట్లవద్ద పటిష్ట బందోబస్తు | Sakshi
Sakshi News home page

ఘాట్లవద్ద పటిష్ట బందోబస్తు

Published Thu, Jul 28 2016 10:58 PM

పుష్కఘాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ రెమా రాజేశ్వరి - Sakshi

ఆత్మకూర్‌ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తుల సౌకర్యార్థం 1500ల మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం మూలమళ్ల, జూరాల పుష్కరఘాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గద్వాల డివిజన్‌ పరిధిలోని బీచుపల్లిలో పెద్ద ఘాట్‌ ఉందని అక్కడ ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 55మంది సీఐలు, 150మంది ఎస్‌ఐలు, వెయ్యి మంది పోలీసులు సేవలందిస్తారన్నారు. జూరాల ప్రాజెక్టు నందిమల్ల పుష్కరఘాట్‌ వద్ద ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 12మంది ఎస్‌ఐలు, 150మంది పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. మిగతా ఘాట్‌లలో ఒక సీఐ, నలుగురు ఎస్‌ఐలు, 40మంది కానిస్టేబుళ్లు ఉంటారని అన్నారు. అన్ని ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు, హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15నుంచి ఘాట్లను ఆధీనంలోకి తీసుకొని అక్కడ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంతోషంగా తిరిగి వెళ్లే విధంగా ముందుకు వెళుతున్నామని అందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి ఇక్కడకు వచ్చే భక్తులకు రూట్‌మ్యాప్‌ తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టామన్నారు.
 
శంషాబాద్‌ నుంచి మొదలుకొని భక్తులకు  సుముఖ మార్గాలు తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ సీహెచ్‌ రాజు, తహసీల్దార్‌ ప్రేమ్‌రాజ్, ఆర్‌ఐ అజయ్‌కుమార్‌రెడ్డి, వీఆర్‌ఓలు యుగందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement