కనిపిస్తే అరెస్ట్‌.. వెతికితే ఒట్టు! | Sakshi
Sakshi News home page

కనిపిస్తే అరెస్ట్‌.. వెతికితే ఒట్టు!

Published Tue, Apr 18 2017 12:26 AM

కనిపిస్తే అరెస్ట్‌.. వెతికితే ఒట్టు! - Sakshi

- ఇసుక మాఫియాకు పోలీస్‌ రక్షణ 
- 34 మందిపై కేసు నమోదు 
- ఇప్పటి వరకు ఐదుగురు మాత్రమే అరెస్ట్‌ 
- మిగతా నేరస్తులంతా బెయిల్‌ కోసం ప్రయత్నాలు 
- నిందితులు అజ్ఞాతంలో ఉన్నారని పోలీసుల నివేదిక 
  
కోడుమూరు : హంద్రీనదిలో లక్షలాది క్యూబిక్‌మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించుకుపోయి కోట్లాది రూపాయలు మూటగట్టుకున్న ఇసుక మాఫీయాకు పోలీసులు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ ఎర్రగుడి, మన్నెగుంట, గోరంట్ల రైతులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అక్రమ ఇసుకను దోచుకున్న వాళ్లందరిపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు హడావుడిగా విచారణ చేసి కృష్ణగిరి మండలంలోని ఎర్రగుడి, రామకృష్ణాపురం, కృష్ణగిరి, మన్నెగుంట, కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామానికి చెందిన 34 మంది ఇసుక వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వీరంతా ఆయా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రధానంగా చలామణి అవుతున్న నేతలు. జిల్లాలోని ముఖ్య నేతల ఆశీస్సులు వీరికి ఉన్నాయి. దీంతో  పోలీసులు తూతూమంత్రంగా వారిపై కేసులు నమోదు చేశారు గాని వారిని ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదు.
 
డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారిపై కేసులు నమోదైన రాజకీయ నాయకుల అండదండలతో బహిరంగంగానే తిరుగుతున్నారు. అయితే వారంతా తప్పించుకొని తిరుగుతూ అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు కోర్టుకు నివేదికలు అందజేస్తున్నారు. చిన్నా చితక నేతలు ఐదుగురిని ఈ కేసులో మొదటగా అరెస్ట్‌ చేశారు. వారికి బెయిల్‌ వచ్చిన వెంటనే ఆ బెయిల్‌ ఆధారంగా మిగతా వాళ్లు కూడా బెయిల్‌ తెచ్చుకునే వెసులుబాటును ఆసరాగా చేసుకొని మిగతా అక్రమార్కులను పోలీసులు అరెస్ట్‌ చేయకుండా వదిలేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా వారందరూ  యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణా నేరంలో ఇద్దరు ముఖ్య నేతలు యాంటిస్ఫెటరీ బెయిల్‌ తెచ్చుకున్నారు. 
 
14మందిని అరెస్ట్‌ చేశాం : సోమ్లనాయక్, ఎస్‌ఐ, కృష్ణగిరి
గోరంట్ల, ఎర్రగుడి సరిహద్దులో గాజులదిన్నె హంద్రీనదిలో ఇసుకను అక్రమంగా తరలించినందుకు 34 మందిపై కేసులు నమోదు చేశాము. ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్‌ చేశాం. ఇద్దరు యాంటిస్ఫెటరీ బెయిల్‌ తెచ్చుకున్నారు. మిగతా నేరస్తులు అజ్ఞాతంలో ఉంటూ తప్పించుకు తిరుగుతున్నారు. త్వరలో వారందరిని అరెస్ట్‌ చేస్తాం.  
 

Advertisement
Advertisement