భూ రిజిస్ట్రేషన్‌పై రాజకీయ ఒత్తిళ్లు | Sakshi
Sakshi News home page

భూ రిజిస్ట్రేషన్‌పై రాజకీయ ఒత్తిళ్లు

Published Fri, Aug 12 2016 12:03 AM

polictical pressures on land regestrations

హిందూపురం అర్బన్‌ : హిందూపురం – బెంగళూరు రోడ్డులో ఉన్న వెంకటేష్‌ కండసారా ఫ్యాక్టరీ భూరిజిస్ట్రేషన్‌ యత్నం రాజకీయ నాయకుల ప్రవేశంతో రసాభాసగా మారి నిలిచిపోయింది. పట్టణ శివారులో ఉన్న  కిరికెర పంచాయతీ సడ్లపల్లి వద్ద ఉన్న వెంకటేశ్వర కండసారా ఫ్యాక్టరీ మిగులు భూమిని ఎంఓయూ చేసుకునేందుకు ఫ్యాక్టరీ సభ్యులుగా కొందరు గురువారం ప్రయత్నించగా స్థానిక టీడీపీ నాయకులు రిజిస్ట్రేషన్‌ జరుగనివ్వకుండా అడ్డుకున్నట్లు సమాచారం.


కిరికెర పంచాయతీలోని సర్వేనంబరు 11–1, 11–2, 12–1, 12–2లో సుమారు 23.17 ఎకరాల భూమిని ఏపీఐఐసీ 1974–1986లో కండసారా ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేటాయించింది. ఇందులో 4.71 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. అయితే మిగులుగా ఉన్న 18.46 ఎకరాలు వెనక్కి అప్పగించాలని 2006లో ఏపీఐఐసీ నోటీసులు ఇచ్చారు. అయితే మొత్తం భూమి కేటాయింపు ఉందని ఫ్యాక్టరీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఫ్యాక్టరీ యాజమాన్యానికి అనుకూలంగా తీర్పువెలువడింది. దీనికి సవాల్‌ చేస్తూ ఏపీఐఐసీ తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లగా దానిపై స్టేటస్‌కో విడుదల అయింది. కాగా ఈ భూమి విషయం ప్రస్తుతం తెరపైకి వచ్చింది.


గురువారం సాయంత్రం మిగులు భూమిని ఎంఓయూ చేసుకునే దిశగా ఫ్యాక్టరీ సభ్యులు యత్నించగా టీడీపీలోఅన్నీ తానే అని చెప్పుకుంటున్న ఓప్రతినిధి రిజిస్ట్రేషన్‌ చేయకుండా నిలిపివేయాలని సబ్‌రిజిస్ట్రార్‌పై ఒత్తిడి పెంచారు. ఈ విషయంగా అధికారపార్టీకి చెందిన కొందరు నాయకులు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద హల్‌చల్‌ చేశారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్‌ సర్వర్‌డౌన్‌ అంటూ చేతులెత్తేశారు. కాగా ఫ్యాక్టరీ సభ్యులు మాత్రం తమ వద్ద కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని ఇక్కడ కాకపోతే జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటామని చెప్పి వెళ్లిపోయారు. ఈ వివాదం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement