రాజకీయం.. వ్యాపారం కాదు | Sakshi
Sakshi News home page

రాజకీయం.. వ్యాపారం కాదు

Published Wed, Jan 25 2017 12:18 AM

రాజకీయం.. వ్యాపారం కాదు - Sakshi

ప్రొద్దుటూరు: రాజకీయం వ్యాపారం కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీనటి ఆర్‌.కె.రోజా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దొరసానిపల్లె జెడ్పీ హైస్కూల్‌లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేదవారి కోసం చేపట్టిన చేయూత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నానన్నారు. అయితే నేడు చాలా మంది దోచుకునేందుకు, దోచుకున్నది దాచుకునేందుకు సేవ పేరుతో రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. ప్రజలను అభిమానించే, ప్రజా సమస్యలపై స్పందించే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి లాంటి నాయకుడు ఉండటం ప్రొద్దుటూరు ప్రజల అదృష్టమని తెలిపారు. డబ్బు సంపాదించుకునేందుకు ఇతర మార్గాలు ఉన్నాయని, ఇందు కోసం రాజకీయాల్లోకి వస్తుండటం దురదృష్టకరమన్నారు. ‘ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న సూక్తిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. శ్రీకృష్ణ భగవానుడు, అల్లా, ఏసు అందరూ తోటి వారికి సాయం అందించాలని చెప్పారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి షేర్‌ ఆటోలు, బస్సుల్లో వస్తున్న బాలికల ఇబ్బందులను గుర్తించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వారికి 47 సైకిళ్లు కొని ఇవ్వడం చాలా మంచి నిర్ణయమని తెలిపారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు కూడా రక్షణ కరువయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. బయటికి వెళ్లిన మహిళలు ఇంటికి వస్తారో లేదోనని ఆందోళన చెందే పరిస్థితి ఉందన్నారు. బాబు వస్తే జాబు వస్తాదని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలను వంచించాడన్నారు.
పేదల సమస్యలపై నా హృదయం చలించింది – ఎమ్మెల్యే రాచమల్లు
    గడపగడపకు వైఎస్సార్‌ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పేదల సమస్యలు అనేకం తన దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వారి సమస్యలను చూసి తన హృదయం స్పందించిందని తెలిపారు. భర్త మరణించడంతో దిక్కులేని కుటుంబం, గూడు మిద్దెలో 23 మంది కుటుంబ సభ్యులు కలిసి ఉంటున్న సమస్య, విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన వ్యక్తి కుటుంబం రోడ్డున పడటం, తండ్రి మృతితో అనాథ అయిన కుటుంబం, బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ వైద్యం కోసం ఎదురుచూస్తుండటం ఇలా అనేక సమస్యలను చూసి తాను ఎంతగానో చలించిపోయానన్నారు. ప్రభుత్వం సాయం చేయకపోవడంతో వీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఈ సమస్యలను కూడా ఏరోజుకారోజు ఇంటికి వెళ్లిన తర్వాత తన సతీమణితో కలిసి చర్చించేవాడినని పేర్కొన్నారు. సమస్యలను చూసి స్పందించే హృదయం ఉండాలేకానీ వీరిని ఆదుకోవడానికి డబ్బే ప్రధానం కాదన్నారు. గత 25 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టింది లేదన్నారు. రాజుపాళెం మండలం కుమ్మరపల్లె గ్రామానికి చెందిన నాయీ బ్రాహ్మణ దంపతులకు పుట్టిన ఇద్దరు సంతానం గత ఏడాది కేసీ కెనాల్‌లో పడి చనిపోయారన్నారు. తిరిగి ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో ఆ కుటుంబం భవిష్యత్తు దృష్ట్యా టెస్ట్‌ట్యూబ్‌ బేబి పద్ధతిలో సంతానం పొందేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దొరసానిపల్లె జెడ్పీహైస్కూల్‌లో చదువుతున్న బాలికలకు 47 సైకిళ్లను కొనివ్వడంతోపాటు మొత్తం రూ.25లక్షల వ్యయంతో 11 రకాల సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపట్టారు.



 

Advertisement
Advertisement