హాస్టల్‌లో ఉండలేం | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో ఉండలేం

Published Wed, Sep 13 2017 10:14 PM

హాస్టల్‌లో ఉండలేం - Sakshi

హిందూపురం అర్బన్‌: హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కాలేజీ హాస్టల్‌లో ఎలాంటి వసతులు లేవని, పలు సమస్యలతో సతమౌతున్నా ప్రిన్సిపాల్, అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని కళాశాల విద్యార్థినులు ఏకరువు పెట్టారు. బుధవారం తరగతులను బహిష్కరించి కాలేజీ బయట బైఠాయించి ధర్నా చేపట్టారు. వీరి ఆందోళనకు విద్యార్థిసంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కాలేజీ అడ్మిషన్‌ సమయంలో అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తామని రూ.వేలు తీసుకోవడమే కాకుండా ప్రతినెల మెస్‌ బిల్లు రూ.1400 వసూలు చేస్తూ ముద్దఅన్నం, నీళ్లచారు అందిస్తున్నారని వాపోయారు.

అంతేగాక గదులు బూత్‌బంగ్లాలా ఉన్నాయని, కనీస విద్యుత్‌ సదుపాయం కూడా లేదని, బాత్‌రూంలో దుర్వాసన వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగురోజుల క్రితం చెట్టు కింద చదువుకుంటున్న బాలికను గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించి తీవ్రంగా గాయపర్చాడన్నారు. హాస్టల్‌లో సెక్యూరిటీ లేదని, మ్యాట్రిన్‌ అసభ్యకరంగా మాట్లాడుతోందని వాపోయారు. వసతులపై ఫిర్యాదు చేస్తే టీసీ ఇచ్చి పంపించేస్తామని ప్రిన్సిపాల్‌ బెదిరిస్తున్నారని బాధ వ్యక్తం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో విద్యార్థి ఐక్యవేదిక నాయకులు బాబావలి, కదీరిష్, జయచంద్ర, నాగభూషçణం, లోకేష్, వెంకటేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement