పేద విద్యార్థులపై ‘డీమ్డ్’ కొరడా! | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులపై ‘డీమ్డ్’ కొరడా!

Published Wed, Dec 30 2015 8:24 AM

పేద విద్యార్థులపై ‘డీమ్డ్’ కొరడా! - Sakshi

♦ ‘డీమ్డ్’ హోదా కోసం అర్రులు చాస్తున్న వైద్య కళాశాలలు
♦ కన్వీనర్ కోటా సీట్లు కోల్పోనున్న పేద విద్యార్థులు
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల ‘డీమ్డ్’ జాఢ్యం ఇపుడు వైద్య, నర్సింగ్ కళాశాలలకూ పాకిపోతోంది. వైద్య కళాశాలలన్నీ ‘డీమ్డ్’ బాట పడుతున్నాయి. అయినవారు అడిగిందే తడవుగా వారి కాలేజీలకు ‘డీమ్డ్’ హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ‘డీమ్డ్’ వర్సిటీ హోదా కోసం ప్రైవేటు వైద్య కళాశాలలు అర్రులు చాస్తుండడంతో వైద్య విద్య ఇక సామాన్యులకు పూర్తిగా దూరం కాబోతున్నదని విద్యారంగ నిపుణులంటున్నారు. ఒక్కసారి డీమ్డ్ హోదా సంపాదిస్తే సదరు కాలేజీలు ఇక తమ ఫీజులు తామే నిర్ణయించుకోవచ్చు. నోటిఫికేషన్‌లు ఇచ్చుకోవచ్చు. సీట్ల భర్తీ తామే చేసుకోవచ్చు. ఇప్పుడు కన్వీనర్ కోటాలో ఉన్న కాలేజీ సీట్లన్నీ పోతాయి.

రిజర్వేషన్లు గానీ, ప్రభుత్వ నిబంధనలుగానీ వీటికి వర్తించవు. నిరుపేదలు, రిజర్వేషన్లు ఉండే విద్యార్థులు, మెరిట్‌ను నమ్ముకున్న విద్యార్థులకు ఈ ‘డీమ్డ్’ వర్సిటీలలో చోటు ఉండదు. ఒకవైపు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్న సర్కారు ఇప్పుడు డీమ్డ్ హోదాతో ప్రైవేట్ కాలేజీలలోనూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తోంది.

 గీతం బాట పడుతున్న ప్రైవేటు కాలేజీలు
 రాష్ర్ట వైద్యవిద్య చరిత్రలో ఎన్నడూ లేనివిధం గా తొలిసారిగా గీతం వైద్య కళాశాలకు డీమ్డ్ వర్సిటీ హోదా దక్కడంతో మిగిలిన ప్రైవేటు వైద్య కళాశాలలు కూడా ఆవైపు చూస్తున్నాయి. రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా మరో 2 కళాశాలలు కూడా అదే ఆలోచనతో ఉన్నాయని సమాచారం. గీతం వైద్య కళాశాలకు డీమ్డ్ హోదా ఇచ్చినట్టే గీతం బీఎస్సీ నర్సింగ్ కళాశాలకు సర్కారు అనుమతి ఇవ్వడం సంచలనం కలిగించింది.

ఇప్పటివరకూ ఎప్పుడూ నర్సింగ్ కళాశాలకు డీమ్డ్ హోదా ఇవ్వలేదు. అలాంటిది గీతం నర్సింగ్ కళాశాలకు డీమ్డ్ హోదా ఇవ్వాలని సర్కారే నేరుగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ)కి  లేఖ రాయడం విమర్శలకు దారి తీసింది. నర్సింగ్ కళాశాలకు డీమ్డ్ హోదా కు అధికారులు ససేమిరా అన్నా.. మంత్రి సహా ప్రభుత్వ పెద్దలు ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలిసింది.

 కన్వీనర్ కోటా సీట్లకు రాంరాం
 వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద, ప్రతిభ ఉన్న విద్యార్థులకు డీమ్డ్ వర్సిటీల వల్ల తీవ్ర నష్టం జరగనున్నది. ప్రస్తుతం ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు ఎంసెట్ మెరిట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీనికి ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఫీజు. మిగతా 50 శాతం సీట్లలో 35 శాతం యాజమాన్య కోటా కింద, మరో 15 శాతం ప్రవాసభారతీయ కోటా (ఎన్‌ఆర్‌ఐ) కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటా సీట్లలో ఎస్సీ, ఎసీ,్ట బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అదే గనుక డీమ్డ్ వర్శిటీలు వస్తే కన్వీనర్ కోటా సీట్లంటూ ఉండవు. అసలు ప్రభుత్వ నిబంధనలేవీ డీమ్డ్ వర్శిటీలకు వర్తించవు.

‘డీమ్డ్’ కోసం ‘నారాయణ’ ఒత్తిళ్లు
గీతం వైద్య కళాశాలకు డీమ్డ్ వర్సిటీ హోదా ఇచ్చినట్టే తమ కళాశాలకూ ఇవ్వాలని నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల రాష్ర్ట ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది.  దీనిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ కళాశాల స్వయానా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణది. ‘డీమ్డ్’ హోదాపై మంత్రి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలిసింది. ‘డీమ్డ్’ హోదా ఇచ్చేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అయినా రాష్ర్టప్రభుత్వం ఇచ్చే ‘నో అబ్జక్షన్’ చాలా కీలకం.

నారాయణ రాష్ర్టప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న కీలకమంత్రి మాత్రమే కాదు మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడు కూడా. అందువల్ల మంత్రిగారి కాలేజీకి ‘డీమ్డ్’ హోదా నల్లేరుపై బండినడకేనని వినిపిస్తోంది. నారాయణ వైద్య కళాశాలకు డీమ్డ్ అనుమతి వస్తే విజయవాడలోని ఎన్‌ఆర్‌ఐ, రాజమండ్రిలో జీఎస్‌ఎల్ కళాశాలలు కూడా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.

ఐఏఎస్‌లపై తీవ్ర ఒత్తిళ్లు...
‘డీమ్డ్’ హోదా విషయంలో కాలేజీల యాజమాన్యాల నుంచి ఐఏఎస్‌లపై తీవ్ర స్థాయిలో వత్తిళ్లు ఉంటున్నాయి. అయితే విశాఖలోని గీతంకు ‘డీమ్డ్’ హోదా విషయంలో ఎల్.వి.సుబ్రమణ్యం నిబంధనలకు కట్టుబడి వ్యహరించారు. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వ పరిశీలనకే అప్పగించారు. అందుకే ఆయన్ను కక్ష కట్టి ఆ శాఖ నుంచి తప్పించారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యకు నిజాయితీ గలిగిన అధికారిణిగా గుర్తింపు ఉంది.  అయితే గీతం బీఎస్సీ నర్సింగ్ కళాశాల విషయంలో పూనంపై రాజకీయంగా తీవ్రస్థాయిలో వత్తిళ్లు వచ్చాయని సమాచారం. ఇపుడు నారాయణ కళాశాల విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు ఆమె లొంగుతారా? లేక నియమ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
 
 డీమ్డ్ వల్ల నష్టాలేమిటంటే...
 ► ఫీజులు ఎంతుండాలనేదానిపై ప్రభుత్వ నిర్ణయం ఉండదు. యాజమాన్యమే నిర్ణయిస్తుంది. నోటిఫికేషన్లు, సీట్ల భర్తీ విషయంలో యాజమాన్యానికేపూర్తి హక్కులుంటాయి.
 ► ప్రశ్నాపత్రం రూపొందించడం, పరీక్షల నిర్వహణ వంటి వాటికి ప్రభుత్వ పర్యవేక్షణ ఉండదు..యాజమాన్యమే చూస్తుంది
 ► యాజమాన్య, కన్వీనర్ కోటా వంటి సీట్లంటూ ఏమీ ఉండవు.
 ► డీమ్డ్ వర్శిటీల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల పేదలు తీవ్రంగా నష్టపోతారు.

Advertisement
Advertisement