అధికారం ఆదేశాలు..పోలీసుల తనిఖీలు! | Sakshi
Sakshi News home page

అధికారం ఆదేశాలు..పోలీసుల తనిఖీలు!

Published Sun, Mar 12 2017 12:27 AM

అధికారం ఆదేశాలు..పోలీసుల తనిఖీలు! - Sakshi

‘నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు’ అన్నట్లుగా పోలీసు యంత్రాంగం తీరు కన్పిస్తోంది. దొరల ఆదేశాలను తూచ తప్పకుండా యంత్రాంగం పాటిస్తోంది. ఆ ప్రకారమే విధులు నిర్వర్తిస్తోంది. ఓవైపు శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవారిని ఉపేక్షిస్తూ స్వామిభక్తి ప్రదర్శిస్తునే, మరోవైపు అధికార దుర్వినియోగంలో పావులుగా మారుతున్నారు. ఇందుకు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విస్తృత తనిఖీలే నిదర్శనం. ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, సిబ్బంది తరలివచ్చి అణువణువునా గాలించారు.
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. యంత్రాంగం ఎన్నికల కమిషన్‌కు లోబడి విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఏకపక్ష చర్యలకు స్వస్తి పలికి, రాజకీయలకతీతంగా నిక్కచ్ఛిగా పనిచేయాల్సి ఉంది. జిల్లాలో పోలీసు అధికారుల తీరు తద్భిన్నంగా ఉంటోంది. ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపుతున్నారు. ‘అదిగో పులి అంటే, ఇదిగో తోక’ అన్నట్లుగా వ్యవహారం ఉంటోంది. అచ్చం అలాంటి ఘటనే జిల్లాకేంద్రంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందిందట. వెంటనే కిందిస్థాయి సిబ్బందిని పురమాయించారు. ఆ మేరకు ఒన్‌టౌన్, రూరల్‌ సీఐలు సత్యనారాయణ, వెంకటశివారెడ్డి, ఎస్‌ఐలు రాజేశ్వరరెడ్డి, అమర్‌నాథరెడ్డి, నాగరాజు, మస్తాన్‌బాషా ఇతర పోలీసు సిబ్బందితో కలిసి కార్యాలయంలో గంటపాటు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బీరువాలు, అల్మార్లు, ఆఫీసు ఫైళ్లు, తుదకు సోఫాసెట్లను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని తాళాలు సిబ్బంది వద్ద ఉండడంతో వారిని రప్పించి మరీ తనిఖీ చేపట్టారు. ఎక్కడ ఎలాంటి నగదు లభించకపోవడంతో తిరుగుముఖం పట్టారు.
బహిరంగంగా హత్యాయత్నం ఇప్పటికీ లభించని పురోగతి
కడపలో కార్పొరేటర్‌ పాకా సురేష్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పట్టపగలు నగర నడిబొడ్డున డీఎస్పీ కార్యాలయం చెంతన అందరూ చూస్తుండగా సురేష్‌పై టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం దాడి చేశారు. ఫిబ్రవరి 27న ఈఘటన చోటుచేసుకుంది. నిందితులు యథేచ్ఛగా నగరంలో హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండువారాలు గడుస్తున్న కేసులో ఇసుమంతైన పురోగతిని పోలీసు అధికారులు సాధించలేకపోయారు. నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, ఎక్కడ ఎలాంటి ఘటన చోటుచేసుకున్నా నిమిషాల్లో తెలిసిపోతుందని గొప్పులకు పోయే యంత్రాంగం సురేష్‌పై దాడికి తెగబడిన నిందితులను, వారి వాహనాలను అదుపులోకి తీసుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఫిబ్రవరి 13న మోచంపేటలో మరో ఘటన చోటుచేసుకుంది. కార్పొరేటర్‌ ఎంఎల్‌ఎన్‌ సురేష్‌బాబుపై తన ఇంటివద్ద మాటువేసి టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. ఈఘటన చోటుచేసుకొని దాదాపు నెలరోజులు గడుస్తోంది. ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. ఇలా అధికారపార్టీ చేసే దాడులను నియంత్రించడంలో, కేసులను ఛేదించడంలో విఫలమవుతోన్న పోలీసుశాఖ మరోవైపు స్వామిభక్తిని మాత్రం ప్రదర్శిస్తోంది. ఎలాంటి ముందస్తు అనుమతి, చర్చ్‌ వారెంట్‌ లేకుండా ఏకంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోదాలు చేపట్టింది. అదేమంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని చెబుతుండటం విశేషం.
ద్వంద్వవైఖరిలో యంత్రాంగం
‘నాపై దాడి చేసే అవకాశం ఉంది. అనుమానిత వాహనాలు వెంటాడుతున్నాయి. కిడ్నాప్‌నకు రెక్కీ నిర్వహించారు. ఓ రాత్రంతా ఇంటివద్ద వాహనాలతో మాటువేశారు. రక్షణ కల్పించండి’ అని కార్పొరేటర్‌ పాకా సురేష్‌ ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబులతో కలిసి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు స్వయంగా విన్నవించారు. వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం తాత్సారం చేసింది. 10రోజులు గడిచేలోపే అతనిపై హత్యాయత్నం జరిగింది. ఇంకోవైపు పోరుమామిళ్ల ఎంపీటీసీ డాక్టర్‌ గౌస్‌పీర్‌ తనయుడు ముర్తుజాహుస్సేన్‌ కిడ్నాప్‌నకు గురయ్యారు. స్పాట్‌లో సెల్‌ఫోన్‌ లభించింది. దుండగుల వాహనాలు సీసీ కెమెరా పుటేజీలో లభించాయి. ఛేదించాల్సిన యంత్రాంగం మిన్నకుండిపోయింది. పైపెచ్చు కేసు విత్‌డ్రా చేసుకుంటే ముర్తుజాను విడుదల చేస్తారని ఏకంగా సీఐ పద్మనాథన్‌ బాధితులపై ఒత్తిడి తెచ్చారు. విత్‌డ్రా చేయించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఫోన్‌కాల్‌ వెళ్లడంతో హఠాత్తుగా తనిఖీలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసుల జిల్లాలో ద్వంద్వవైఖరి పై ఘటనలతో తేటతెల్లం అవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల కోడ్‌లో సైతం ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇకనైనా ఎన్నికల కమిషన్‌ జిల్లాపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.

 

Advertisement
Advertisement