కలెక్టర్‌ గారూ.. కనికరించండి | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ గారూ.. కనికరించండి

Published Fri, Apr 21 2017 1:41 AM

కలెక్టర్‌ గారూ.. కనికరించండి - Sakshi

ఒక వైపు కరువు.. ఇంకో వైపు వలసలు.. మరో వైపు వ్యవసాయోత్పత్తులకు ధర లేక దిగాలు పడ్డ రైతులతో జిల్లా అతలాకుతలమవుతోంది. కలెక్టరేట్‌లో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు ఉద్యోగులను వెక్కిరిస్తున్నాయి. రెవెన్యూ సమస్యలు తీరక రైతులు విలవిల్లాడుతున్నారు. ప్రధానమైన అభివృద్ధి ప్రాజెక్టులన్నీ పడకేశాయి. సాగు, తాగునీటి సమస్యలతో పల్లె జనంఅల్లాడుతున్నారు. ఈ తరుణంలో జిల్లాకు కొత్త కలెక్టర్‌ ప్రద్యుమ్న వస్తున్నారు. శుక్రవారం ఆయన  బాధ్యతలు చేపట్టనున్నారు. కరువు నేలపై కనికరం చూపాలని జనం కోరుకుంటున్నారు.
 
తిరుపతి : జిల్లాలో పల్లెజీవనం దుర్భరంగా మారింది. కరువు విలయ తాండవం చేస్తోంది. తాగునీరు లేక 15 మండలాల్లో జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. ఉపాధి పనులు దొరక్క మండు వేసవిలోనూ పది వేల మందికి పైగా రైతులు, కూలీలు నిత్యం వలస వెళ్తున్నారు. కుప్పం పరిసర మండలాల నుంచి, పలమనేరు, మదనపల్లి ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే జిల్లా వాసులు పెరిగారు. సరైన ఉపాధి పనులు దొరక్కపోవడం ఒక కారణమైతే, చేసిన పనులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం మరో కారణం. మరో వైపు రైతులు పలు రకాల సమస్యలతో ఆర్థికంగా నష్టపోయారు. ప్రధానంగా పండించిన పంటకు సరైన గిట్టుబా«టు ధర లేక మామిడి, టమాటా రైతులు రూ.200 కోట్లకు పైగా నష్టపోయారు. వేసవి ఎండలు పెరిగి పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు లేక, సుదూర ప్రాంతాలకు రవాణా చేయలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికితోడు 2015–16 సీజన్‌ల పంట నష్టపోయిన రైతులకు అందాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.128 కోట్లకు గాను రూ.20 కోట్లు నిలిచిపోయింది.

ఆన్‌లైన్‌ సమస్యల వల్ల 6 వేల మంది రైతులకు పంపిణీ ఆగిపోయింది. జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలు ఆగిపోయాయి. అంగన్‌వాడీ వర్కర్లకు నాలుగు నెలలుగా జీతాలు అందలేదు. జిల్లాలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ఆగిపోయింది. రెవెన్యూ సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగాయి. సర్వేయర్లు లేక మండలాల్లో భూ వివాదాలు, వాటి తాలూకు ఫిర్యాదులు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోలేదు. చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో భూములకు విపరీతంగా ధరలు పెరగడంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగాయి. తిరుపతి పరిసరాల్లోని హాథీరాంజీ మఠం భూములు 800 ఎకరాలకు పైగా ఆక్రమణల్లో ఉన్నాయి. వీటికి తోడు దేవాదాయ, రెవెన్యూ, వాగు పోరంబోకు భూములు సైతం అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. జిల్లాలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. స్వర్ణముఖి నదిలో విలువైన ఇసుకను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్న ఇసుకాసురులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మైనింగ్‌ శాఖ పూర్తిగా నిద్రావస్థలో ఉంది. ఇకపోతే వైద్య రంగంలో కీలకంగా వ్యవహరించాల్సిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో వైద్యం అస్తవ్యస్తంగా మారింది.

నేడు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ
శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న గురువారం తిరుమల చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో రెవెన్యూ ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీజేఏసీ రాష్ట్ర కోశాధికారి నర్సింహులు నాయుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయసింహారెడ్డి, వీఆర్‌వోల సంఘం నేతలు భక్తవత్సలనాయుడు, బాలాజీరెడ్డి తదితరులు కలిసి కలెక్టర్‌కు సాదర స్వాగతం పలికారు.

Advertisement
Advertisement