ఆరుపళ్ల విభాగంలో ప్రకాశం ఫస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఆరుపళ్ల విభాగంలో ప్రకాశం ఫస్ట్‌

Published Thu, Oct 13 2016 6:54 PM

ఆరుపళ్ల విభాగంలో ప్రకాశం ఫస్ట్‌ - Sakshi

గన్నవరం : మండలంలోని కేసరపల్లిలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి వరకూ ఆరుపళ్ల విభాగంలో పోటీలు జరిగాయి. మొత్తం పది ఎడ్ల జతలు పాల్గొనగా, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన నుసుం బయ్యప్పరెడ్డి ఎడ్లజత నిర్ణీత వ్యవధిలో బండను 3,749.2 అడుగుల దూరంలాగి ప్రథమ స్థానంలో నిలిచింది. రూ.20వేల బహుమతి అందుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్లజత 3,385.6 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.15వేలు, ప్రత్తిపాడుకు చెందిన నూతలపాటి పరమేశ్వరరావు ఎడ్లజత 3,319 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచి రూ.12వేల బహుమతి అందుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరుకు చెందిన దొడ్డక సాయికృష్ణ ఎడ్లు 3,245 అడుగులు లాగి నాల్గో స్థానంలో రూ.10వేలు, విజయవాడకు చెందిన మేకా కృష్ణమోహన్‌ ఎడ్లజత 3,050 అడుగులు లాగి ఐదో స్థానంలో రూ.6వేల నగదు అందుకున్నాయి. అనంతరం ఆరుపళ్ల విభాగపు స్పాన్సర్‌ వీరవల్లికి చెందిన చిలకపాటి రాజీవ్‌ ఎడ్లజతల నిర్వాహకులకు బహుమతులు అందజేశారు. 
సేద్యపు విభాగంలో..
రైతు సేద్యపు విభాగంలో గురువారం పోటీలు కొనసాగాయి. రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 12 ఎడ్లజతలు ఈ విభాగంలో హోరాహోరీగా బలప్రదర్శనను సాగిస్తున్నాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకటబాలవర్ధనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, ఇందిరా పుడ్స్‌ అధినేత మండవ వెంకటరత్నం, రైతు నాయకులు నందమూరి రాధాకృష్ణమూర్తితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు వీక్షించారు.  నిర్వాహకులు మల్లంపాటి బాబూరావు, వింత సాంబిరెడ్డి, రిపరీ సురపనేని రాధాకృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement