ప్రక్షాళన పర్వం | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన పర్వం

Published Sun, Aug 21 2016 1:50 AM

ప్రక్షాళన పర్వం - Sakshi

కొవ్వూరు : గోదావరి నదీ గర్భాన్ని ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైంది. నాలుగు దశాబ్దాల అనంతరం డ్రెడ్జింగ్‌ ద్వారా నదిలోని ఇసుక మేటలను తొలగించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. «ధవళేశ్వరం ఆనకట్టకు ఎగువన సుమారు 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక మేటల్ని తొలగించేందుకు గోదావరి హెడ్‌వర్క్స్‌ అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకోసం రూ.16.52 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా, నిధులు సైతం విడుదలయ్యాయి. డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓషన్‌ స్వార్కిల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దక్కించుకుంది. క్యూబిక్‌ మీటర్‌ ఇసుకను డ్రెడ్జింగ్‌ ద్వారా తొలగించేందుకు రూ.155 చొప్పున ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఈ పనులకు సంబంధించి సదరు సంస్థతో రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తికానున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి డ్రెడ్జింగ్‌ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. తవ్విన ఇసుకను ప్రభుత్వ అభివృద్ధి, పోల వరం ప్రాజెక్ట్, కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులకు ప్రధానంగా కేటాయించనున్నట్టు చెబుతున్నారు. కొంత ఇసుకను నది మధ్యన గల పిచ్చుకల్లంక లెవెలింగ్‌ పనులకు వినియోగిస్తామంటున్నారు. గత ఏడాది మే నెలలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆ««దl్వర్యంలో అధికారుల బృందం గోదావరిలో సర్వే చేసింది. ఆనకట్టకు ఎగువన 50 లక్షల నుంచి 60 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక మేటలు వేసినట్టు గుర్తించారు. నదిలో ఏటా డ్రెడ్జింగ్‌ జరిపించాలని ప్రతినిధుల బృందం సూచించింది. పనులను గత ఏడాదే చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతూ వచ్చింది.
తాగునీటి ఇబ్బందులకు చెక్‌
వాడపల్లి, గోంగూరతిప్పలంక, కాటవరం, కోటిలింగాల రేవు సమీపంలో మేటలు తొలగించాలని నిర్ణయించారు. తద్వారా విశాఖపట్నం, రాజమహేంద్రవరం నగరాల్లో తాగునీటి ఇబ్బందుల్ని అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
 
రబీ కష్టాలు గట్టెక్కేనా!
ఉభయ గోదావరి జిల్లాల్లో 10.12 లక్షల ఎకరాల డెల్టా ఆయకట్టు ఉంది. చేపల చెరువులు, తోటలు మినహాయిస్తే 8.96 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది.  రైతులు ఏటా రెండో పంటకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2.93 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ధవళేశ్వరం ఆనకట్టకు ఉంది. ఈ ప్రాంతంలో ఇసుక మేటలు భారీగా పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. నాలుగు దశాబ్దాల క్రితం వరకు వరదల అనంతరం గోదావరిలో ఇసుక మేటలను ఏటా తొలగించేవారు. ఆ తరువాత ఈ ప్రక్రియను గాలికొదిలేశారు. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల రైతులకు రెండో పంటలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 2009లో తీవ్ర గడ్డు పరిస్థితులు తలెత్తాయి. ఆ తరువాత 2010, 2013 సంవత్సరాలు మినహా ఏటా సాగునీటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వంతులవారీ విధానంలో పంటలను సాగు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఆనకట్టకు ఎగువన 50 నుంచి 60 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక మేటలు ఉన్నట్టు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గుర్తించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తవ్వడానికి మాత్రమే టెండర్లు పిలిచింది. ఈ పనులైనా సకాలంలో సవ్యంగా పూర్తిచేస్తే వస్తే రబీ నాటికి రైతులకు సాగునీటి కష్టాలను అధిగమించే అవకాశం ఏర్పడుతుంది.
 
ఉచిత ఇసుక మాటేమిటో!?
క్యూబిక్‌ మీటర్‌ ఇసుక తవ్వడానికి రూ.155 చొప్పున కాంట్రాక్ట్‌ సంస్థకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన యూనిట్‌ ఇసుక (మూడు క్యూబిక్‌ మీటర్లు) రూ.465 అవుతుంది. దీనికి లోడింగ్‌ చార్జీలు వంటివి కలుపుకుంటే రూ.500 పైబడి ధర పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. ఈ తరుణంలో డ్రెడ్జింగ్‌ చేసిన ఇసుకను వివిధ అభివృద్ధి పనులకు ఉపయోగించుకునే కాంట్రాక్ట్‌ సంస్థలు ఆ ధర చెల్లించడానికి ఎంతమేరకు ముందుకు వస్తాయనేది అనుమానంగా ఉంది. దీనిపై సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
 
నెలాఖరు నాటికి పనులు
ఈ నెలాఖరు నాటికి ్రyð డ్జింగ్‌ పనులు ప్రారంభిస్తాం. ముందుగా సర్వే చేపడతాం. ఏ ప్రాంతంలో ఇసుక మేటలు తీయాలన్నది నిర్ణయిస్తాం. గోదావరిలో వరద నీరు తగ్గిన తర్వాత అక్టోబర్‌ నుంచి పనులు పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. నాలుగు ఆర్మ్‌లలో సమానంగా నీరు ప్రవహించే విధంగా మేటలు తొలగిస్తాం. ముందుగా స్కవర్‌ స్లూయిజ్, నాలుగు ఆర్మ్‌లకు ఎదురుగా ఉన్న మేటల్ని తొలగిస్తాం.
–ఎన్‌.కృష్ణారావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం
 

Advertisement

తప్పక చదవండి

Advertisement