నివేదికలు సిద్ధం చేయండి | Sakshi
Sakshi News home page

నివేదికలు సిద్ధం చేయండి

Published Wed, Sep 28 2016 12:23 AM

నివేదికలు సిద్ధం చేయండి

  • పంట నష్టం అంచనాలు సత్వరమే రూపొందించాలి
  • రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది
  • వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తం కావాలి
  • జెడ్పీ సర్వసభ్య సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం 
  • హన్మకొండ : జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జరిగిన పంట నష్టంపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి  నివేదిక పంపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వర్షాలతో జరిగిన పంట నష్టాలను పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కడియం మాట్లాడుతూ.. వర్షాలు, వరుదలతో నష్టపోయిన పంటల వివరాలపై అంచనాలు రూపొందించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
     
    వ్యవసాయ యాంత్రీకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. పంట నష్టం నివేదికల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలన్నారు. అవి నిరూపణ అయితే  త్రీమెన్‌ కమిటీ సభ్యులపై చర్య తీసుకోవాలని  ఆదేశించారు. రైతులకు నిబంధనల మేరకే ట్రాక్టర్లు ఇస్తున్నామని, గ్రూపులకే ఇవ్వాలనేది ఎక్కడా లేదని అన్నారు. అయితే గ్రూపులకు ఇస్తే చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నందున, అలాంటి వారికి ఇస్తే బాగుంటుందని సూచించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం రాయితీపై అందిస్తోందని, అవి అర్హులకే అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎంపిక చేసిన రైతుల జాబితాలు మండల కార్యాలయాల్లోని నోటీసు బోర్డుపై పెట్టాలని సూచించారు. జిల్లాలో 5550 చెరువులుండగా 3663 చెరువులు పూర్తిగా, 1400 చెరువులు 70 శాతం పైగా నిండాయని వివరించారు.
     
    450 చెరువుల్లో 50 శాతం కంటే తక్కువ నీరు చేరిందన్నారు. దీంతో రబీలో సాగు విస్తీర్ణం పెరుగనుందని, ఈ మేరకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో రబీలో కోటి ఎకరాలు సాగు కావచ్చన్నారు.   శ్రీరాంసాగర్, ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లు నిండాయని, పాకాల, లక్నవరంలో నీరు పూర్తి స్థాయిలో ఉందని, రామప్ప చెరువులోకి దేవాదుల ద్వారా గోదావరి నీటిని పంపింగ్‌ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో గతంలో కంటే ఆస్పత్రుల పరిస్థితి మెరుగుపడిందన్నారు. భారీ వర్షాలు కురిసిన క్రమంలో అంటు వ్యా«ధులు ప్రబలే ప్రమాదం ఉందని, వైద్యులు అందుబాటులో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఎజెన్సీలో డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
     
    డాక్టర్ల కొరత లేకుండా కాంట్రాక్ట్‌ లేదా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్‌ అధికారులను అదేశించారు. జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 4.41 కోట్ల మొక్కలు నాటామన్నారు. రాష్ట్రంలో వరంగల్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. 4 కోట్ల లక్ష్యం కాగా లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలో వరుసగా రెండవసారి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement