టీటీడీ వేద పాఠశాల ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్ | Sakshi
Sakshi News home page

టీటీడీ వేద పాఠశాల ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్

Published Fri, Dec 25 2015 12:05 PM

టీటీడీ వేద పాఠశాల ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్

భీమవరం: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఆకివీడు మండలం ఐ.భీమవరంలో నిర్మించిన వేద పాఠశాల భవన సముదాయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు.  అనంతరం రాష్ట్రపతి వేద పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇవాళ ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరి హకింపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ స్వాగతం పలికారు. అక్కడ ఉదయం 11.05 నిమిషాలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.25 గంటలకు ఐ.భీమవరం చేరుకున్నారు.  అనంతరం రాష్ట్రపతి తిరుపతి బయల్దేరి వెళతారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకూ ముగ్గురు రాష్ట్రపతులు పర్యటించారు. గతంలో రాష్ట్రపతి హోదాలో జ్ఞానీ జైల్‌సింగ్, అబ్దుల్ కలాం జిల్లాకు విచ్చేశారు. ఇరవై ఏళ్ల కిందట జ్ఞానీజైల్‌సింగ్ పశ్చిమ పర్యటనకు రాగా, అబ్దుల్ కలామ్ భీమవరం ప్రాంతంలో రాష్ట్రపతి హోదాలో ఒకసారి పర్యటించారు. ప్రణబ్ ముఖర్జీ రాకతో జిల్లాలో ముగ్గురు రాష్ట్రపతులు పర్యటించిన ఘనత నమోదు అయింది.

Advertisement
Advertisement