ప్రాజెక్టులు పట్టాలెక్కేనా? | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?

Published Sat, Sep 10 2016 7:18 PM

ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?

జంగారెడ్డిగూడెం : జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రెండు ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారు 40 ఏళ్లుగా పనులు పూర్తికాక పెండింగ్‌లో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం, 2003లో ప్రారంభించిన తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు పట్టాలెక్కనున్నాయి. ప్రధానమంత్రి కృషి సించాయ్‌ (పీఎంకేఎస్‌వై) పథకం కింద ఈ రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు ఈ పథకం కింద ఎంపిక కాగా జిల్లాలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను దీనిలో ఎంపిక చేశారు. సుధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రెండు పథకాలను మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఈనెల 6న న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ వనగారియా, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు మధ్య ఒప్పందం కుదిరింది. అదే రోజు దీనికి సంబంధించి అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నాబార్డు నిధుల ద్వారా 2019–20లోగా వీటి పనులు పూర్తిచేయాలని నిర్ణయించింది. తొలిదశలో 2016–17లో 23 ప్రాజెక్టులు, 2017–18లో 31 ప్రాజెక్టులు, మూడో దశలో 2019 డిసెంబర్‌నాటికి మిగిలిన 45 ప్రాజెక్టులు పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో ఆయా ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు అయ్యే నిధుల్లో కేంద్రం పీఎంకేఎస్‌వై కింద ఆయా ప్రాధాన్యతల బట్టి కొంత భరించగా మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాను అవసరమైతే నాబార్డు నుంచి రుణం పొందే వెసులుబాటును తాజా ఒప్పందంతో కలుగుతుంది. 
కేకేఎం ఎర్రకాలువ జలాశయం
కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని 1977లో ప్రారంభించారు. దీనికి గాను అప్పట్లో రూ.10.40 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే సుమారు 40 సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. ఇప్పటి వరకు రూ.103.62 కోట్లు ఈ ప్రాజెక్టుపై వెచ్చించారు. 2004 అంచనాల ప్రకారం రూ.124.95 కోట్లు ప్రాజెక్టు పూర్తికావడానికి అవసరమవుతుంది. తాజా అంచనాల ప్రకారం ఇంకా రూ. 23 కోట్లు అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 34,364 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. కుడి ప్రధాన కాలువ కింద 19,700 ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ కింద 5 వేల ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ విస్తరణలో భాగంగా 3,008 ఎకరాలు, ఈ కాలువపై ఎత్తిపోతల పథకం కింద 6,656 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. అయితే ప్రస్తుతానికి కుడికాలువ కింద 10 వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద 5 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. కుడికాలువ కింద ఏడు డిస్ట్రిబ్యూటరీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 45.60 కిలోమీటర్ల మేర ఎడమ కాలువ, 7.59 కిలోమీటర్ల ఎడమ కాలువ విస్తీర్ణం పనులు ఇంకా పూర్తికాలేదు. 
తాడిపూడి ఎత్తిపోతల పథకం ఇలా
తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని 2003లో ప్రారంభించారు. 2005 నుంచి సాగునీటిని విడుదల చేస్తున్నప్పటికీ అప్పట్లో కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. ఈ పథకం ద్వారా 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. పంట బోదెలు, భూసేకరణ పెండింగ్‌లో ఉండటంతో తాడిపూడి ఎత్తిపోతల పథకం పూర్తిగా పట్టాలెక్కలేదు. నేటికీ సగం మేర కూడా సాగునీరు అందించలేకపోతోంది. తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో మొత్తం 2.06 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. అయితే చాలా చోట్ల తవ్విన కాలువలు, బోదెలు పూడుకుపోయాయి. వీటిని మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
తాడిపూడి ఎత్తిపోతల పథకం మొత్తం అంచనాలు రూ. 526.17 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.338.48 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.188 కోట్లు అవసరం. ఈ ప్రాజెక్టు పూర్తికి పీఎంకేఎస్‌వై పథకం కింద కేంద్రం ఆర్థిక సహకారం అందివ్వనుంది. కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేయడంపైనే ప్రాజెక్టుల భవితవ్యం ఆధారపడింది. పనులు సవ్యంగా సాగకపోతే తమ కష్టాలు ఎప్పటిమాదిరిగానే ఉంటాయని రైతులు చెబుతున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement