సమస్యల చదువు! | Sakshi
Sakshi News home page

సమస్యల చదువు!

Published Mon, Jul 3 2017 12:10 AM

సమస్యల చదువు!

► సమస్యల సుడిగుండంలో ప్రభుత్వ విద్య
► పర్యవేక్షణ అధికారుల లేమి    కానరాని మౌలిక వసతులు
► కోట్లు వెచ్చిస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే


పర్యవేక్షణాధికారుల లేమి, కానరాని మౌలిక వసతులు, మరుగుదొడ్లు, గదులు, తాగునీరు సమస్యలతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. జిల్లాలోని 16 మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈవోలే కొనసాగుతున్నారు. ఉప విద్యాధికారుల పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రాథమిక పాఠశాలల విద్యవ్యవస్థ మెరుగు కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. ప్రభుత్వ విద్య పేదల దరిచేరడం లేదు. బోధన, బోధనేతర సిబ్బంది కొరత వెంటాడుతోంది. సమస్యల కారణంగా ప్రతిఏటా వందలాది మంది విద్యార్థులు ప్రైవేటువైపు మళ్లుతున్నారు.

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా  425 ప్రాథమిక పాఠశాలలు, 75 ప్రాథమికోన్నత పాఠశాలలు, 149 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 11 కేజీబీవీలు, 11 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,42,471 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన తీరుపై తల్లిదండ్రులు నమ్మకం కోల్పోయి పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్చడానికే ఎక్కుగా మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం అటు విద్యాశాఖను ఇటు తల్లిదండ్రులను  ఆందోళనకు గురి చేస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఏ మేరకు మిగులుతాయో అనే గుబులు పట్టుకుంది.

అందరూ ఇన్‌చార్జిలే  జిల్లా విద్యాశాఖనుపర్యవేక్షకుల కొరత వేధిస్తోంది. జిల్లాలోని అన్ని మండలాల్లో రెగ్యులర్‌ ఎంఈవోలు లేక సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఏర్పడ్డ కరీంనగర్‌–1, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంట మండలాలకు ఇప్పటివరకు ఎంఈవో పోస్టులు మంజూరేచేయలేదు. దీంతో అక్కడ కూడా సీనియర్‌ హెచ్‌ఎంలే ఎంఈవోలుగా కొనసాగుతున్నారు. ఇన్‌చార్జిల పాలన ఫలితంగా జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పర్యవేక్షణ లోపిస్తోంది. మధ్యాహ్న భోజన పథకం అమలు గాడితప్పుతోంది.

ఉప విద్యాధికారులూ ఇన్‌చార్జిలే
ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించే ఉప విద్యాధికారుల పోస్టులు కరీంనగర్, హుజూరాబాద్‌తో పాటు జిల్లా పరిషత్‌ డెప్యూటీ ఈవో, ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈవోలంతా ఇన్‌చార్జీలే. అలాగే ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు 120 మంది సబ్జెక్టు టీచర్లు కొరతగా ఉన్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్ధులకు విషయ పరిజ్ఞానం దెబ్బతింటోంది. ఇక ప్రాథమిక విద్యను బలోపేతం చేయాల్సిన సర్వశిక్షాభియాన్‌ అధికారి లేకపోవడంతో జిల్లా విద్యాశాఖాధికారే అదనంగా సర్వశిక్షాభియాన్‌ పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

చెట్ల కిందే చదువులు ..
ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేక.. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులూ ఇబ్బందులెదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో.. హాలులో.. చెట్ల కిందే చదువులు కొనసాగుతున్నాయి. 327 తరగతి గదులకు మేజర్‌ మరమ్మతులు ,359 గదులు కూల్చివేయాలని సర్వశిక్షాభియాన్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా నేటికి ఫలితం లేదు. జిల్లాలో 206 అదనపు తరగతుల గదుల నిర్మాణాల అవసరమన్న ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లేదు. పాఠశాల భవనాలు శిథిలావస్థ దశకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియదు. దీంతో వర్షాలు కురిస్తే చాలు.. స్కూలుకు సెలవు ఇవ్వాల్సిందే.

టాయిలెట్లు ఉండవు.. ప్రహరీలు లేవు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటోన్న సమస్యల్లో మూత్రశాలలు.. ప్రహరీలు లేకపోవడం గమనార్హం. మల, మూత్ర విసర్జన వసతుల లేక ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ వివరాల ప్రకారం బడుల్లో బాలురవి 117, బాలికలవి 87 మరుగుదొడ్లు నిరూపయోగంగా ఉన్నాయి. 

బాలురకు 20, బాలికలకు 87 మరుగుదొడ్లు అవసరమని ప్రతిపాదనలు పంపి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీంతో బహిర్భూమి కోసం విద్యార్థినులు ఇళ్లకు వెళ్తున్నారు. స్కూళ్లలో విద్యార్థినుల  ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం ఆరంభం వరకు ప్రతి పాఠశాలలో టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటివరకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. విద్యాశాఖ మాత్రం పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించడం గమనార్హం. 72 స్కూళ్లలో ప్రహరీలు లేవు.

స్థానికత ఏదీ?
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3,006 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల 134 మంది విద్యావాలంటీర్లను నియమించారు. వీరంతా సమయపాలన పాటించడం లేదని సమాచారం. ఉపాధ్యాయులు సమయానికి రాక.. సరిగ్గా బోధించకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుకు పంపేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఉపాధ్యాయులు తాము పనిచేసేచోట ఉంటున్నవారు వెయ్యిలోపే. మిగిలినవారంతా పట్టణాలు, నగరాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మారుమూల ప్రాంతాలవారికి బస్సు మిస్‌ అయితే.. ఆ రోజంతా విద్యార్థులు ఆటపాటలతో గడపాల్సిందే. ఉపాధ్యాయులంద రూ ప్రార్థన సమయానికి పాఠశాలలో ఉండాలని నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని సమాచారం. కొందరు ప్రార్థన ముగిశాక.. మరికొందరు ఓ పీరియడ్‌ ముగిశాక చేరుకుంటున్నట్లు సమాచారం.

వేధిస్తున్న వంట గదుల కొరత
ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం మధాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో 1,42,471 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. వీరికి వంట చేసి పెట్టేందుకు 3,723  మంది వంటమనుషులు, హెల్పర్లు ఉన్నారు. పథకంలో భాగంగా ప్రతి ఏజెన్సీకి ఓ వంటగది ఉండాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గత విద్యాసంవత్సరం తొలి విడతగా 522 షెడ్లు మంజూరు చేసింది. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.రెండున్నర లక్షలు కేటాయించింది. అయితే ఇప్పటివరకు 380 షెడ్ల నిర్మాణం పూర్తయింది. రెండో విడతలో.. 919 వంటషెడ్లు మంజూరైనా.. కేవలం 369 మాత్రమే ప్రగతిలో ఉన్నాయి.

Advertisement
Advertisement