రోడ్డెక్కుతున్న జనం | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కుతున్న జనం

Published Wed, Nov 23 2016 3:36 AM

రోడ్డెక్కుతున్న జనం

ఇంకా పెరిగిన ‘నోట్ల రద్దు’ కష్టాలు
 
- బ్యాంకులు, ఏటీఎంల వద్ద అవే క్యూలైన్లు
- ఎక్కడ చూసినా నోక్యాష్ బోర్డులతో బేజారు
- పూర్తిగా స్తంభించిపోరుున వ్యాపారాలు
- పలు చోట్ల ఆందోళనలకు దిగుతున్న ప్రజలు
- నిత్యావసరాల కోసం, వైద్యం కోసం నగదు లేక ఆవేదన
- మరోవైపు భారీగా నోట్ల మార్పిడి వ్యాపారం
 
 నోట్ల రద్దు పరిణామాలతో ప్రజలకు కష్టాలు తీరడం లేదు. ఎక్కడ చూసినా బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద నగదు కోసం జనం బారులు తీరి కనిపిస్తున్నారు. కానీ మధ్యాహ్నానికే బ్యాంకులు నోక్యాష్ బోర్డులు పెడుతుండడం, ఏటీఎంలు వెంట వెంటనే ఖాళీ అవుతుండడంతో జనం బేజారు అవుతున్నారు. రాష్ట్రంలో ఇంకా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో చిల్లర కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నారుు. రూ.2వేల నోటుకు చిల్లర లభించక అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాజధాని హైదరాబాద్‌లో బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేని కారణంగా ఖాతాదారులకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు మాత్రమే నగదు విత్‌డ్రాకు అవకాశమిచ్చారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం అవసరమైన డబ్బు కోసం చాలా మంది బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం కనిపించలేదు. నగదు కష్టాలు మరో వారం పాటు తప్పవని బ్యాంకర్లు చెబుతుండడం గమనార్హం. మరోవైపు పాత నోట్లు మార్చి కొత్త నోట్లు ఇస్తామంటూ భారీ ఎత్తున దళారులు బేరసారాలు సాగిస్తున్నారు.
 - సాక్షి నెట్‌వర్క్
 
 కడుపు మండి..
 ఆంధ్రా బ్యాంకులో డబ్బులు ఇవ్వడం లేదంటూ మంగళవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో ప్రజలు రోడ్డెక్కారు. కొందుర్గు, ఉమ్మెంత్యాల, తుమ్మలపల్లి, విశ్వనాథ్‌పూర్, తంగెళ్లపల్లి, పర్వతాపూర్ తదితర గ్రామాల ప్రజలంతా కలసి బైఠారుుంచారు. తమకు వెంటనే నగదు ఏర్పాటు చేయాలంటూ రాస్తారోకో చేశారు. నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ దగ్గర ఉన్న సొమ్మంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని, చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు మానుకుని నాలుగు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నామని.. డబ్బు లేకుంటే తమ అవసరాలు ఎలా తీరుతాయని నిలదీశారు. అధికారులు స్పందించి తమకు డబ్బు అందేలా ఏర్పాటు చేయాలని.. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  పాల్గొన్నారు.

 ఎస్‌బీహెచ్ ఏటీఎం ధ్వంసం
 పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఎస్‌బీహెచ్ ఏటీఎంను మంగళవారం రాత్రి ఓ యువకుడు ధ్వంసం చేశాడు. ఏటీఎంలో నుంచి డబ్బులు రావడం లేదని ఆగ్రహించి ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు.

 నోట్లు డిపాజిట్ చేసి వెళుతూ..
 నోట్ల మార్పిడి, డిపాజిట్ల సమస్య జనాల ప్రాణాలను బలిగొంటూనే ఉంది. పాత నోట్లను డిపాజిట్ చేసి ఇంటికి తిరిగి వెళుతున్న ఓ 85 ఏళ్ల వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జనగామ జిల్లా కేంద్రంలోని పాత కురుమవాడకు చెందిన కడింగుల ఎల్లయ్య (85) పింఛన్ కింద వచ్చిన పాత రూ.500 నోట్లను కొద్ది నెలలుగా దాచుకున్నాడు.

 నోట్లు రద్దు కావడంతో వాటిని డిపాజిట్ చేసేందుకు నాలుగు రోజులుగా ఇక్కడి ఎస్‌బీహెచ్ బ్రాంచికి వెళుతున్నా.. రద్దీగా ఉండడంతో వీలుపడలేదు. మంగళవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన ఎల్లయ్య మూడు గంటల పాటు క్యూలో నిలబడి డిపాజిట్ చేశాడు. బ్యాంకు నుంచి బయటికి వచ్చి.. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డుపై జేసీబీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో మృతి చెందాడు.
 
 రూ.లక్షకు.. రూ.20 వేల కమీషన్
 బ్లాక్‌మనీని ‘వైట్’గా మార్చేందుకు దళారులు ప్రయత్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాల పెట్రోల్ బంకు వద్ద రూ.లక్షకు రూ.20 వేలు కమీషన్ తీసుకుని.. నోట్లు మార్చుతున్న ముగ్గురిని పోలీసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు.
 
 పండుటాకులకు పుట్టెడు కష్టం
 మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడలోని ఆంధ్రా బ్యాంకులో నగదు లేదంటూ మూసివేయడంతో ఆసరా పింఛన్‌దారులు రోడ్డెక్కారు. లబ్ధిదారులంతా రోడ్డు బైఠారుుంచి రాస్తారోకో చేశారు. దీంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోరుుంది. మరికల్ పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేశారు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి రెండు రోజుల తర్వాత వచ్చి పింఛన్లు తీసుకెళ్లాలని సూచించారు.
 
 లాలీ జో లాలీ..
 నోట్ల మార్పిడికి బ్యాంకులకు ఎగబడుతున్న జనంపై కొందరు బ్యాంకు సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ బ్యాంకు ఉద్యోగి ఔదార్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మెదక్ జిల్లా చేగుంట ఆంధ్రాబ్యాంకులో డబ్బులు తీసుకోవడానికి రెండు నెలల పసిగుడ్డుతో ఇందుర్‌ప్రియాల్‌కు చెందిన భూదేవి అనే మహిళ వచ్చింది. చిన్నారిని ఎత్తుకొని క్యూలో నిల్చొని ఇబ్బంది పడుతుండడంతో అక్కడే విధుల్లో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ మధు చిన్నారిని ఇలా ఎత్తుకొని ఊరడించారు.
 
 పెళ్లి ఉంది డబ్బు ఇప్పించండి
 మెదక్ పట్టణం జిలానిగడ్డకు చెందిన బిలాల్‌ఖాన్ కుమారుడు ఇమ్రాన్‌ఖాన్ పెళ్లి వచ్చేనెల 15న జరగనుంది. పెళ్లికోసం ముందుగానే ఇక్కడి ఎస్‌బీఐలో రూ.3.5 లక్షలు డిపాజిట్ చేశారు. అరుుతే పెళ్లి సమయం దగ్గరపడుతుండడంతో చేతిలో చిల్లిగవ్వలేక మంగళవారం బ్యాంకుకు వచ్చి మేనేజర్‌తో గోడు వెల్లబోసుకున్నారు. పెళ్లికి బంగారం, వస్త్రాలు, ఫంక్షన్ హాల్, ఇతర సామగ్రి కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రకటించిన మేరకు రూ.2.5 లక్షలైనా ఇవ్వాలని కోరారు. కానీ తమకింకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని మేనేజర్ చెప్పడంతో బిలాల్‌ఖాన్ నివ్వెరపోయారు. తాము కష్టపడి సంపాదించి, కూడబెట్టిన డబ్బు కూడా తమకు అక్కరకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 పంటను కాపాడుకోలేక..
 

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు రైతు జాటోత్ సామ్యా. మహబూబ్‌నగర్ జిల్లా కేసముద్రం మండలం తూర్పు తండాకు చెందిన సామ్యాది దీనగాధ. పండిన పంటలు అమ్ముకోలేడు. సాగులో ఉన్న పంటలను రక్షించుకోలేడు. ఇంతకుముందు వేసిన పత్తి 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. దాన్ని అమ్ముకుందాంటే నోట్ల రద్దు సమస్య వచ్చి పడింది. ఇక సాగులో ఉన్న మిరప పంటకు తెగులు సోకింది. పురుగుల మందు తెచ్చి చల్లాలనుకుంటే.. చేతిలో డబ్బుల్లేవు. ఎవరివద్ద అరుునా బదులు తీసుకుందామనుకున్నా ఇచ్చే పరిస్థితి లేదు. కళ్ల ఎదుట పంట దెబ్బతింటున్నా కాపాడుకోలేక సామ్యా ఆందోళనలో మునిగిపోయాడు.
 
 ధాన్యం అమ్ముకునే దారేది?
 తన ఇంటి ఆవరణలో ఓ రైతు ఇలా ధాన్యం ఆరబోసుకున్నాడు. తేమ ఉండడంతో ఆరబోయడం కాదు.. మార్కెట్‌కు వెళితే కొనేవారు లేక.. ఎవరైనా కొన్నా పాత పెద్ద నోట్లు ఇస్తున్నారని తెలిసి ఈ పని చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం పూసల్‌పహాడ్ గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి అనే రైతు బాధ ఇది. మార్కెట్ వరకూ తీసుకెళ్లి సమస్యలు పడేకంటే ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకోవడమే మేలని భావించి ఈ పని చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు నోట్ల రద్దు కారణంగా కూలీలకు కూలి డబ్బులు ఇవ్వలేకపోతున్నామని, వాళ్లు రోజూ ఇంటికి వచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
 
 కుమారుడికి వైద్యం చేరుుంచలేక..
 

ఈ ఫొటోలో ఉన్నది మహబూబ్‌నగర్ జిల్లా నెల్లికుదురుకు చెందిన రైతు హెచ్చు వెంకన్న. తాను వేసిన పత్తి పంట దిగుబడి వచ్చినా.. నోట్ల రద్దు కారణంగా అమ్ముకోలేకపోయాడు. కానీ వెంకన్న కుమారుడు అనారోగ్యం బారినపడ్డాడు. వరంగల్‌లోని ఆస్పత్రికి తీసుకెళదామంటే చేతిలో డబ్బుల్లేవు. దీంతో కొంత పత్తిని తీసుకుని కేసముద్రంలోని జిన్నింగ్ మిల్లుకు తీసుకువచ్చాడు. పత్తి కొనేందుకు వ్యాపారి సిద్ధంగా ఉన్నా.. నగదు లేదని, చెక్కు ఇస్తానని స్పష్టం చేశాడు. దీంతో చెక్కు తీసుకున్న వెంకన్న.. దానిని బ్యాంకులో వేసి, నగదు తీసుకున్నాకే కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన గత్యంతరం పట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
Advertisement