ప్రజలవద్దకు పాలనే ప్రభుత్వ లక్ష్యం | Sakshi
Sakshi News home page

ప్రజలవద్దకు పాలనే ప్రభుత్వ లక్ష్యం

Published Mon, Oct 10 2016 12:44 AM

public relation are important

 
మంత్రి జూపల్లి కృష్ణారావు
వీపనగండ్ల : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు నూతనంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనను ప్రజలవద్దకు తీసుకెళ్లి బంగారు తెలంగాణను సాధించటమే ప్రభుత్వ లక్ష్యంగా ఏర్పరచుకున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఆయన నూతనంగా ఏర్పాటు చేయనున్న చిన్నంబావి మండలంలోని కార్యాలయాలను పరిశీలించారు. ప్రజలకు చేరువైన జిల్లాలు, మండలాలతో అధికార యంత్రాంగమంతా ప్రజలతో ఉంటుందని, అవినీతికి తావులేకుండా ఉంటుందని అన్నారు. గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 40లక్షల జనాభా ఉండేదని, దీన్ని నాలుగు జిల్లాలుగా మార్చడం వల్ల ప్రజలకు ప్రభుత్వపాలన చేరువవుతుందని, ఈ విషయం జీర్ణించుకోలేని కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం సరికాదని అన్నారు. దసరా పండుగ రోజు ఏర్పాటు కానున్న నూతన జిల్లాలు, మండలాల ప్రారంభ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్‌ సింగిల్‌విండో అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, చైర్మన్‌ జగ్గారి శ్రీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొండూరు గోపాల్, నాయకులు గోవింద్‌గౌడ్, గోపాల్‌నాయుడు, కృష్ణప్రసాద్, పుల్లయ్యశెట్టి, జయగౌడ్, ఆంజనేయులు, జ్యోతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement
Advertisement