సత్యదేవుని భక్తులకు కొత్త కానుక | Sakshi
Sakshi News home page

సత్యదేవుని భక్తులకు కొత్త కానుక

Published Tue, Jun 20 2017 12:09 AM

pulihora, daddhojanam distribution on ratnagiri

అన్నవరం :
గత నవంబర్‌ నుంచి మూత పడిన సబ్‌ క్యాంటీన్‌ భవనం వద్ద సత్యదేవుని భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీని అన్నవరం దేవస్థానం సోమవారం ప్రారంభించింది. పులిహోర పంపిణీని దేవస్థానం పాలక మండలి సభ్యులు కొత్త వేంకటేశ్వరరావు(కొండబాబు), యడ్ల బేతాళుడు, ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావులు ఉదయం తొమ్మిది గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. నిర్వాహకునికి, దేవస్థానానికి ఏర్పడిన వివాదం నేపథ్యంలో సబ్‌ క్యాంటీన్‌ను మూసివేశారు. దీంతో సబ్‌ క్యాంటీన్‌ సమీపంలోని ఐదు సత్రాల్లోని 300 గదుల్లో   బస చేసే భక్తులకు ఫలహారాలు, భోజనం లభ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవస్థానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఏడు నెలలుగా భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫలహారాలు కావాలన్నా, భోజనం కావాలన్నా అర కిలోమీటరు దూరంలో ఈఓ కార్యాలయం దిగువన ఉన్న మెయిన్‌ క్యాంటీన్‌ వద్దకు రావాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 16న జరిగిన దేవస్థానం పాలక మండలి సమావేశంలో సబ్‌ క్యాంటీన్‌ వద్ద ఉదయం పులిహోర, దద్ధోజనం పంపిణీ చేయాలని తీర్మానించారు. సాధారణ రోజుల్లో రోజుకు వెయ్యిమందికి, పర్వదినాల్లో రెండు వేల మందికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనిని సోమవారం నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా, పగటి వేళ పులిహోర, దద్ధోజనం పంపిణీ చేసినా రాత్రి వేళల్లో మాత్రం ఫలహారాలు కావాలంటే భక్తులు మెయిన్‌ క్యాంటీన్‌ వరకూ రావల్సిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు సబ్‌ క్యాంటీన్‌ను తిరిగి ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement