సంగమేశ్వరం..భక్తి పారవశ్యం | Sakshi
Sakshi News home page

సంగమేశ్వరం..భక్తి పారవశ్యం

Published Sat, Aug 13 2016 12:21 AM

సంగమేశ్వరం..భక్తి పారవశ్యం

– శాస్త్రోక్తంగా నదీమ తల్లికి హారతులు
– తెల్లవారుజామున 5.45 నిమిషాలకు ప్రారంభమైన పుష్కరాలు
– తరలివచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు
– తొలిరోజు పుష్కర స్నానమాచరించిన ప్రజాప్రతినిధులు
– భక్తుల సేవలలో అధికార యంత్రాంగం
 
సంగమేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి :
సప్తనదుల కూడలి సంగమేశ్వర క్షేత్రం..భక్తిపారవశ్యంతో ఓలలాడింది. శుక్రవారం తెల్లవారుజామున 5.54 నిమిషాలకు వేదపండితులు నదీమ తల్లి కృష్ణమ్మకు పూజలు చేసి.. హారతులిచ్చి పుష్కరాలను ప్రారంభించారు. సంగమేశ్వర ఘాట్‌ వద్ద జెడ్పీ చైర్మన్‌ రాజశేఖర్, ఎస్పీ ఆకె రవికృష్ణ, జేసీ హరికిరణ్, టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శివానందరెడ్డి తొలిసారిగా పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తుల సంఖ్య ఉదయం చాలా మందకొడిగా ఉండటంతో ఘాట్లు వెలవెలబోయాయి. అయితే ఈ సంఖ్య 11 గంటల తరువాత రానురాను పుంజుకోవడంతో కోలాహలం కనిపించింది. తొలిరోజు సాయంత్రం 6.10 గంటలకు పుష్కర స్నానాలను ముగించారు. 
డిప్యూటీ సీఎం గైర్హాజరు
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన కృష్ణా పుష్కర ప్రారంభోత్సవ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. సంగమేశ్వర క్షేత్రం వద్ద డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా పుష్కరాలు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులే పుష్కరాలను ప్రారంభించారు.
ప్రజాప్రతినిధుల పుణ్యస్నానాలు
సప్తనదీ సంగమేశ్వర క్షేత్రం వద్ద పుష్కర స్నానం ఆచరించేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐజయ్య క్షేత్రానికి చేరుకుని పుష్కర స్నానమాచరించారు. అనంతరం లలిత సంగమేశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. అక్కడ ఏర్పాట్లపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వీఐపీ ఘాట్‌ ఇక్కడ లేదా అంటూ కొత్తపల్లి తహశీల్దార్‌ నరసింహులును నిలదీశారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సతీసమేతంగా పుష్కరస్నానాలు ఆచరించి లలిత సంగమేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి పుష్కరిణిలో స్నానాలు చేశారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టి.. రాయలసీమ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించమని సంగమేశ్వరుడిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపారు.
పరవశించిన భక్తులు..
సంగమేశ్వరంలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు కష్ణానది పరవళ్ల సోయగాలను, సముద్రాన్ని తలపించేలా ఉన్న కృష్ణమ్మను చూస్తూ పరవశించిపోయారు. నిజంగానే నదీమ తల్లిలో స్నానం ఆచరించగానే తమ పాపాలు తొలగిపోయినట్లుగా భావన కలిగిందని మరికొందరు చెప్పుకోవడం జరిగింది. రాయలసీమ వాసులతోపాటు ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి భక్తులు తరలివచ్చారు.
 జేసీ పర్యవేక్షణలో ఏర్పాట్లు.. 
సంగమేశ్వరం వద్ద భక్తుల కోసం చేపట్టిన పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటంతో వాటిని పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను  జాయింట్‌ కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆదేశించారు. భక్తులెవరైనా తేలు, పాము కాటుకు గురైతే వారికి తక్షణమే ప్రథమ చికిత్స అందించి.. అవసరమైతే జిల్లా కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సహాయ వైద్యాధికారి రాజా సుబ్బారావుకు సూచించారు. పుష్కరాలకు వచ్చే వికలాంగులను వలంటీర్లు జాగ్రత్తగా పుష్కర స్నానాలు చేయించి అదేక్రమంలో వారిని సురక్షితంగా వాహనాల్లో కూర్చోబెట్టాలన్నారు. అయితే అక్కడ పుష్కర విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు, సిబ్బంది అరకొర వసతులు కల్పించడం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో ఉన్న వారికి కనీసం మంచినీటిని అందించకపోవడంతో వారందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement