నాణ్యత... వారి ప్రత్యేకత! | Sakshi
Sakshi News home page

నాణ్యత... వారి ప్రత్యేకత!

Published Wed, Aug 31 2016 9:46 PM

నాణ్యత... వారి ప్రత్యేకత!

→   ఖైదీల నిర్వహణలో పెట్రోల్‌ బంక్‌లు
→   నాణ్యమైన ఇంధనం.. నిర్ధిష్టమైన కొలతలు
→   బారులు తీరుతున్న వాహనదారులు
→   రోజుకు రూ. 4 లక్షలకు పైగా వ్యాపారం

బుక్కరాయసముద్రం : ఓపెన్‌ ఎయిర్‌ జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో నిర్వహిస్తున్న పెట్రోలు బంకుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌ వద్దlఆధునాతన సౌకర్యాలతో ఈ ఏడాది మే నెలలో 2 ఐఓసీ పెట్రోలు బంకులను రూ. 4 కోట్లతో జైలుశాఖ ఏర్పాటు చేసింది. ఈ పెట్రోల్‌ బంకుల్లో 20 మంది ఖైదీలు పనిచేస్తున్నారు.  నీలంపల్లి రోడ్డు వైపు ఉన్న పెట్రోలు బంక్‌లో రోజుకు రూ. 2.50 లక్షల వ్యాపారం జరుగుతోంది. దీనికి ఎదురుగా ఉన్న మరో పెట్రోలు బంక్‌లో రూ.1.50 లక్షల లావాదేవీలు సాగుతున్నాయి. ఇందులో పనిచేసే ఖైదీలకు రోజుకు 70 రూపాయలు కూలి చెల్లిస్తున్నారు. రోజుకు రూ. 4 లక్షల ప్రకారం నెలకు కోటి రూపాయలకు పైగా వ్యాపారలావాదేవీలు ఖైదీలు నిర్వహిస్తున్నారని జైలు అధికారులు పేర్కొంటున్నారు.

నాణ్యమైన పెట్రోలు
మీటర్‌ రీడింగ్‌  వద్ద మొదలుకుని సరుకు కల్తీ వరకు పలు రకాల్లో వినియోగదారులను చాలా పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు మోసగిస్తుంటారు. అయితే ఓపెన్‌ ఎయిర్‌ జైలు పరిధిలో ఉన్న రెండు పెట్రోలు బంకులలో ఇలాంటి అక్రమాలకు తావు లేదు. ఇక్కడ నాణ్యమైన పెట్రోల్‌ లభిస్తుండటంతో వాహనదారులు ఎక్కువగా వస్తుంటారు. వీటిని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తుండటం కారణంగా వినియోగదారులు పెట్రోలు, డీజిల్‌ కోసం క్యూ కడుతున్నారు. ఫుల్‌ట్యాంక్‌ కావాలనుకునేవారు తప్పని సరిగా ఓపెన్‌ ఎయిర్‌ జైలు వద్ద ఉన్న పెట్రోల్‌ బంకుల వద్దకే వెళుతుంటారు. నాణ్యమైన పెట్రోల్‌తో పాటు మీటర్‌ రీడింగ్‌ కూడా ఇక్కడ కచ్చితంగా ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు.

బతుకు తెరువుకు దోహదం
జైల్లో ఉంటునే పెట్రోలు బంకులో పనిచేస్తున్నా... బయటకు వెళ్లినా పెట్రోలు బంకులలో పని చేస్తూ బతికే ఆత్మసై్థర్యం వచ్చింది.    మా దగ్గర నాణ్యమైన పెట్రోల్‌ దొరుకుతుందని ఎక్కువ మంది ఇక్కడికే వస్తుంటారు.
– శంకర్, ఖైదీ

పెట్రోల్లో నాణ్యత ఎక్కువ
మిగతా పెట్రోల్‌ బంకుల్లో కన్నా ఇక్కడ పోస్తున్న పెట్రోల్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ వేయించుకుంటున్న పెట్రోల్‌తో నా బండి మైలేజీ కూడా పెరిగింది. కల్తీ లేకపోవడంతో రిపేరీలు కూడా తగ్గాయి. అందుకే అనంతపురంలో పెట్రోల్‌ వేయించుకోవడం మానేశాను. కచ్చితంగా జైలు దగ్గరకే వచ్చి పెట్రోల్‌ పోయించుకుంటున్నాను.
– లక్ష్మిరెడ్డి, జంతులూరు

నాణ్యమైన పెట్రోలు అందిస్తాం
పెట్రోల్, డీజిల్‌ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. మేం నాణ్యమైన పెట్రోలు అందిస్తున్నాం కాబట్టే ఎక్కువ మంది వాహనదారులు ఇక్కడికే వచ్చి పెట్రోల్‌ పోయించుకుంటున్నారు. కొలతల విషయంలో కూడా కచ్చితంగా వ్యవహరిస్తున్నాం. పెట్రోల్‌ బంకుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలోని జైళ్ల అభివద్ధికి, ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తాం. మరో రెండు నెలల్లో పెట్రోలు బంకులలో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.  ఇప్పటికే మూడు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగి ఉంటుంది.
– శ్రీనివాసులు, సూపరింటెండెంట్, ఓపెన్‌ ఎయిర్‌ జైలు

Advertisement
Advertisement