అంతేనా? | Sakshi
Sakshi News home page

అంతేనా?

Published Tue, Jul 26 2016 2:10 PM

railway food plaza closed in tirupathi

  నాలుగు నెలలక్రితం 
  మూతపడ్డ రైల్వే ఫుడ్ ప్లాజా
  నిలువుదోపిడీకి గురవుతున్న ప్రయాణికులు
 
తిరుపతి అర్బన్ :‘తిరుపతి రైల్వే ఫుడ్ ప్లాజా మూతపడింది. బయట తిందామంటే ధరల మోత. ఆకలికి ఏదో ఒకటి తిని తృప్తి చెందాలనుకుంటే ఆహారం, తినుబండారాల్లో నాణ్యతే ఉండదు.. నాలుగు నెలలుగా నరకం అనుభవిస్తున్నాం.. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు’అని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వేశాఖ పరిధిలోని ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుడ్‌ప్లాజా నిర్వాహకులు చెల్లించాల్సిన ముందస్తు అడ్వాన్స్ రూ.కోటిని సకాలంలో చెల్లించకపోవడంతో సికింద్రాబాద్ జోనల్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 14న మూత వేయించారు. 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు దీన్ని పునఃప్రారంభించలేదు. సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే రైల్వే ప్రయాణికులకు సరైన తిండి లభించక నరకయాతన అనుభవిస్తున్నారు. 
 
 తనిఖీలు నిల్
రైల్వేస్టేషన్ ఎదురుగా, పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, తోపుడు బండ్ల టిఫిన్ వ్యాపారులపై తనిఖీలు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెప్పిందే ధర.. పెట్టిందే మెనూ అన్నట్టుగా తయారైంది వీరి వ్యవహారం. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కలుషిత ఆహారం తిని ప్రాణాలమీదికి తెచ్చుకోవాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. 
 
 నాసిరకం..పాచిపోయిన వంటకాలే
 రైల్వేస్టేషన్ ఎదురుగా ఉండే హోటళ్లలో ముందురోజు రాత్రి వండి మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయం ఇడ్లీకో, లెమన్ రైస్‌కో కలిపి వడ్డించేస్తున్నారు. వాటిని తిన్న ప్రయాణికులు అనారోగ్యం పాలవుతున్నారు.  బయ టి హోటళ్లలో ఎదురయ్యే ఇబ్బందులపై రైల్వే స్టేషన్‌లోని అధికారులకు ఫిర్యా దు చేసినా ఫలితం లేకపోతోందని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. 
 
 నిబంధనలకు పాతర
 భారత ఆహార భద్రతా(ఫుడ్‌సేఫ్టీ) చట్టం ప్రకారం ప్రతి జిల్లాలోనూ ఫుడ్‌సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో చిన్న హోటల్ నుంచి కార్పొరేట్ హోటల్ వరకు ధరల పట్టికను అమలు చేయాలి. అయితే రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న హోటళ్లలో చాలావరకు ధరల పట్టికను కూడా నిర్వహించడం లేదు. కొందరు పట్టికలను వేలాడదీసినా అందులో ధరలు నమోదుచేసి ఉండరు. ఇకనైనా రైల్వే ఐఆర్‌సీటీసీ అధికారులు స్పందించి రైల్వే ఫుడ్ ప్లాజాను త్వరగా తెరిపించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 

Advertisement
Advertisement