వర్షం పంటలకు జీవం | Sakshi
Sakshi News home page

వర్షం పంటలకు జీవం

Published Mon, Aug 1 2016 5:47 PM

వర్షం పంటలకు జీవం - Sakshi

  • ఖరీఫ్‌ సాగుకు తప్పిన కష్టకాలం
  • రైతుల మోముల్లో ఆనందం
  • కళకళలాడుతున్న పంటలు
  • నారాయణఖేడ్‌: వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు మూడేళ్లపాటు పంటల సాగుకు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత సీజన్‌లో కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందం నిలుపుతోంది. వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్‌ మాసంలో సరైన వానలు పడలేదు. మొదట పంట సాగుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యంగా విత్తనాలు వేశారు. పంట ఎదుగుదల సమయంలో వర్షాలు పడడంతో మొలకలకు జీవం పోసినట్లయ్యింది.

    జూన్‌ మాసంలో సాధారణ వర్షపాతం 112 మి.మీటర్లు కాగా 110 మి.మీటర్లు పడింది. అయినా రైతులు విత్తనాలు వేశారు. జూలై మాసంలో 212 మి.మీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా 355 మి.మీటర్లు పడింది. దీంతో పంటలకు మేలు చేకూరింది. ప్రతి ఏటా జొన్న పంట 5,202 హెక్టార్లలో సాగు చేస్తారు. ఇప్పటి వరకు 4,100 హెక్టార్లు సాగయ్యింది. పెసర 11,849 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 13,200 హెక్టార్లు సాగు చేశారు. మినుము 6,898హెక్టార్లకు గాను 8,100 హెక్టార్లు, కంది 6.653 హెక్టార్లకు గాను 8,700 హెక్టార్లు, మొక్కజొన్న 4,237 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 3,500 హెక్టార్ల మేర సాగుచేశారు. పత్తి పంట మాత్రం 10,626 హెక్టార్లు ఇప్పటి వరకు 4,800 హెక్టర్ల మేర మాత్రమే వేశారు. పప్పుదినుసుల సాగు బాగానే ఉంది.
    వర్షాలతో చీడపీడలు
    ఎడతెరపి లేని వర్షాల వల్ల పంటలకు చీడపీడలు ఆశిస్తున్నాయి. ఇప్పటికే పలు పంటలకు ఈ సమస్య ఉంది. సోయాబీన్‌, పెసర, మినుము పంటలకు శనగ పచ్చ పురుగు, పొగాకుకు లద్దెపురుగు, మినుము పంటకు బూడిద తెగులు, పత్తి పంటకు రసం పీల్చు పురుగు, కందికి ఆకు గూడు పురుగు వ్యాప్తి చెందాయి. పంట మంచి ఎదుగుతున్నా చీడపీడలతో రైతులు కాస్త దిగాలు పడుతున్నారు. పెసర, మినుము, సోయా పంటలకు ఆశించిన శనగ పచ్చ పురుగు, పొగాకుకు లద్దెపురుగు నివారణకు మోనోక్రోటోపాస్‌, ఫినాల్‌పాస్‌ పిచికారీ చేయాలని వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

    మినుకు ఆశిస్తున్న బూడిద తెగులుకు కాపరాస్‌ క్లోరైడ్‌, మోనోక్రొటోపాస్‌ కలిపి పిచికారీ చేయాలని, పత్తిలో రసం పీల్చు పురుగు నివారణకు మిడ్రాక్లూరిఫైడ్‌, ఎసిపెట్‌ స్ప్రే చేయాలని చెప్పారు. కంది పంటకు ఆశిస్తున్న ఆకుగూడు పురుగు నివారణకు ఫినాల్‌ పాస్‌, మోనోక్రోటోపాస్‌లలో ఏదైనా పిచికారీ చేయవచ్చని తెలిపారు. కంది, పెసర, మినుములో మిశ్రమంగా సాగు చేస్తున్నందున ఆ పంటలకు మందు పిచికారీ చేస్తున్నందున కందికి ప్రత్యేకంగా అవసరం లేదని ఆ పంటలకు చేసే పిచికారీ వల్లే కందికి సైతం లబ్ధి చేకూరుతుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement