రైతునైతే అధికారులను చెప్పుతో కొడతా | Sakshi
Sakshi News home page

రైతునైతే అధికారులను చెప్పుతో కొడతా

Published Sat, Oct 15 2016 6:26 PM

raitu naite adikarulanu chepputo kodata

– కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌
ఏలూరు (మెట్రో)
జిల్లాలో రైతులు ఎంతో సహనం, ఓపికతో ఉంటారని వారి మంచితనాన్ని ఆసరా చేసుకుని సేద్యపునీటి ప్రాజెక్టు పనులు ఇష్టానుసారంగా తీవ్ర జాప్యం చేస్తున్నారనీ, అదే తాను రైతునైతే నిర్లక్ష్యం వహించే అధికారులను చెప్పుతో కొడతానంటూ జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ శెట్టిపేట ఇఇ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో శనివార సేద్యపునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల ప్రగతి తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ రబీ పంట కాలంలో ప్రతి సంవత్సరం డెల్టాలో మురుగునీటిని పంట కాలువల్లోకి తాత్కాలిక పద్ధతిలో మోటార్ల ద్వారా నీరును తోడుతున్నారని ప్రతి ఏటా తాత్కాలిక పనులు చేపట్టి లక్షలాధి రూపాయలు వధా చేసే బదులు మూడేళ్లు ఖర్చుపెట్టే సొమ్ముతో శాశ్వత ప్రాతిపదికన మోటార్లు ఏర్పాటు చేయాలని రెండు నెలల కిత్రం చెప్పినప్పటికీ నేటికీ తగిన ప్రతిపాదనలు ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించారు. రైతులంటే ఇంత నిర్లక్ష్యమా, అధికారులు చేసే నిర్లక్ష్యం వల్ల  రైతులు బలవ్వాలా అంటే కలెక్టర్‌ ప్రశ్నించారు. రానున్న రబీ పంటకు శాశ్వత ప్రాతిపదికన ఇరవై నాలుగు ప్రాంతాల్లో నీటిని మళ్లించేందుకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేసి మోటార్లు బిగించకుంటే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. యనమదుర్రు డ్రై యిన్‌పై మూడేళ్ల నుండి బ్రిడ్జీలు నిర్మాణ పనులు పూర్తి చేయలేదని ఎప్పుడు చూసినా రెండు పిల్లర్స్‌ కొన్ని చోట్ల శ్లాబ్‌ పనులు మాత్రమే దర్శనమిస్తున్నాయన్నారు. ఈ సీజన్‌లో మాత్రం డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రాజెక్టుల డిజైన్లు మార్చే ప్రసక్తే లేదని కలెక్టర్‌ చెప్పారు. జాతీయ రహదారి నిర్మాణం చేయకుండానే కొవ్వూరులో తాత్కాలిక టోల్‌ప్లాజా పెట్టి ప్రజల నుండి టోల్‌పీజు వసూలు చేసే వారిపై కేసు నమోదు చేసి తక్షణమే తాత్కాలిక టోల్‌ప్లాజాను తొలగించాలని కలెక్టర్‌ కొవ్వూరు ఆర్‌డిఒను ఆదేశించారు.  టోల్‌ప్లాజా ఏర్పాటుకు ఇంకా స్థలం నోటిఫై చేయకుండానే ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా టోల్‌ఫ్లాజా ఏర్పాటు చేసి ప్రజల నుండి డబ్బులు ఏ విధంగా వసూలు చేస్తున్నారని తక్షణమే టోల్‌ప్లాజాను తొలగించాలని ఆదేశించారు. నరసాపురం నుండి కోటిపల్లి వరకూ గోదావరిపై రైల్వేశాఖ నిర్మిస్తున్న బ్రిడ్జితో పాటు రోడ్డుకం రైల్‌బ్రిడ్జి నిర్మిస్తే వాహనాల రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుందని ఈ మేరకు ఆర్‌అండ్‌బి తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్‌ కలెక్టర్‌ షరీఫ్, స్పెషల్‌ కలెక్టర్‌ భానుప్రసాద్, ఐటిడిఎ పీఒ షాన్‌మోహన్, ఆర్‌డిఒలు దినేష్‌కుమార్, తేజ్‌భరత్, శ్రీనివాసరావు, ఎస్‌ఇ శ్రీనివాసయాదవ్, డ్వామా పీడీ వెంకటరమణ, ఇరిగేషన్‌ ఎస్‌ఇ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement