పేరొందిందిలా.. | Sakshi
Sakshi News home page

పేరొందిందిలా..

Published Fri, Nov 18 2016 12:08 AM

పేరొందిందిలా..

 
  • గోదావరి నీడలో ఊరుఊరికీ, పేటపేటకూ ఓ చరిత్ర 
 
‘వాట్‌ ఈజ్‌ ఇన్‌ ఏ నేమ్‌?’–మహాకవి విలియమ్‌ షేక్‌స్పియర్‌ రచించిన రోమియో అండ్‌ జూలియట్‌లో జూలియట్‌ నోట వెలువడిన పలుకులివి. ‘ఏ పేరుతో పిలిచినా, గులాబీ అదే మధుర గుబాళింపులను ఇస్తుంది కదా–పేరులో ఏముంది?’ ఇది జూలియట్‌ వాదన. గురజాడ కన్యాశుల్కంలో గిరీశం ఇంచుమించుగా ఇవే మాటలు అంటాడు..’విడో అనేది ఏమిటి? ఏ నేమ్‌! ఓపేరు. ఆ పేరు మనిషి మొహమ్మీద రాసుందా?.. జూలియట్‌ అంతరంగానికి, గిరీశం అంతరంగానికి హస్తమశకాంతర భేదం ఉన్నా, ఇద్దరి మాటలు ఒకటే. అయితే, పేరులోనే గలదు పెన్నిధి అనుకునేవారు లేకపోలేదు. ఎవరెలా భావించినా, ఒక ప్రాంతానికి ఆ పేరు రావడానికి అనేక చారిత్రక, సామాజిక కోణాలు ఉండవచ్చు. ఏ పేరయితే ఏమిటని తేలికగా తీసిపడెయ్యక, ఆ పేరు ఎలా వచ్చింది? అని తెలుసుకోవడం ఆసక్తిదాయకం. జిల్లాలో కొన్ని ప్రాంతాలకు, తెలుగువారి సాంన్కృతిక రాజధాని రాజమహేంద్రిలో ఆయా ప్రాంతాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకోవాలని ఉందా.. అయితే చదివేయండి!  – రాజమహేంద్రవరం కల్చరల్‌
 
నల్లమందు సెంటర్‌..
మీరు ఆటోవాలాను పిలిచి నల్లమందు సందుకు పోవాలంటే వాడు ఇబ్బంది పడడు. అదే మీరు కందుల వీరరాఘవస్వామినాయుడు రోడ్డుకు పోవాలంటే, వాడు మీ ఒంక ఆశ్చర్యంగా చూస్తాడు. రాజమహేంద్రి మెయిన్‌ రోడ్డును ఆనుకుని ఉన్న కందుల వీర రాఘవస్వామి నాయుడు నగరంలో ప్రముఖ వాణిజ్యకూడలి.1950 వరకు ఒక ముసలమ్మ గంపలో నల్లమందు తీసుకువచ్చి అమ్మేది. నల్లమందు సందు పేరు అలా వాడుకలోకి వచ్చింది. ఆ పేరునే ప్రజ ఖరారు చేసింది. ప్రభుత్వం చేసిన నామకరణం ఏదైనా ’పడినముద్ర చెరిగి పోదురా!అన్నాడుకదా ఓ సినీ కవి.
 
కొన్ని ముఖ్యప్రాంతాలు–వాటి పేర్లు
= మూడు లాంతర్ల సెంటరుగా పేరుపొందిన ఆప్రాంతం బత్తిన సోదరులు కోల్‌కత్తా నుంచి అమ్మవారి పాలరాతి విగ్రహాన్ని తీసుకువచ్చి, అక్కడ నెలకొల్పడంతో దేవీచౌకైంది.
దివ్యజ్ఞానసమాజం నాయకుడు ఆల్కాట్‌ ఆధ్వర్యంలో దివ్యజ్ఞాన సమాజం ప్రార్థనలు జరిగే ప్రాంతం ఆల్కాట్‌ గార్డెన్‌ అయింది.
1865లో నాటి సబ్‌ కలెక్టర్‌ ఇన్నిసిస్‌ వలస స్థావరం ఏర్పరుచుకున్న ప్రాంతం తర్వాత రోజుల్లో ఇన్నీసుపేట అయింది.
జానపదగీతాలతో వేదాంతాన్ని, అహింసావాదాన్ని ప్రచారం చేసిన జానపద గాయకుడు యెడ్ల రామదాసు పేరిట రామదాసుపేట ఏర్పడింది.
కరువుకాటకాలు తట్టుకోలేక విశాఖ జిల్లా జామి నుంచి ప్రజలు తరలి వచ్చి నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతం జామిపేట, రూపాంతరం చెంది జాంపేటైంది. జాంపేట కూడలిలో మహాత్ముని విగ్రహాన్ని అప్పట్లో టంగుటూరి ప్రకాశం ఆవిష్కరించారు.
 
కోటగుమ్మం
ప్రాచీనకాలంలో కోటలు ఎత్తయిన ప్రాంతాలలో ఉండి చుట్టూ లోతైన కందకాలు ఉండేది. నేటి గోదావరి స్టేషను ఎదుట రాజరాజు కోట ఉండేదట. ఆ ప్రాంతానికి కోటగుమ్మం అని నేటికీ పేరు. దానికి ఓ పక్క కందకం రోడ్డు పల్లంలోనే నేటికీ ఉంది. మరో పక్కన ఉన్న–గోదావరికి వెళ్లే(పుష్కరాలరేవుకు చేరుకునే) రోడ్డు కూడా పల్లంలోనే ఉంది.
 
కవులు–దేశనాయకుల పేరిట...
నన్నయవీధి శ్రీరాంనగర్‌లో ఉంది. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి పేరిట వీధి లలితానగరులో ఉంది. వసురాయకవి పేరిట వీధి ఇన్నీసుపేటలో, డాక్టర్‌ ఏబీ నాగేశ్వరరావు పేరిటవీధి ఆర్యాపురంలో, డాక్టర్‌ బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం పేరిట సీతంపేటలో వీధులు ఉన్నాయి. 
 
తూర్పుగోదావరి జిల్లాలో ఇతర ప్రాంతాలు
వనవాసంలో పాండవులు నివసించారని చెబు తున్న పాండవులమెట్ట పెద్దాపురంలో ఉంది. శ్రీరాముడు వనవాసకాలంలో ‘సఖీ! ఇది నేటిమన పల్లి’ అన్నప్రాంతానికి సఖినేటిపల్లి అని పేరొచ్చింది. పలివెలగ్రామంలోని ఉమా కొప్పేశ్వరస్వామి ఆలయానికి ఆ పేరు రావడానికి ఒకకథ వాడుకలో ఉంది. గ్రామంలో అర్చకుడు వారకాంత సహచర్యంలో ఎక్కువకాలం గడుపతూ ఉండేవాడు. ఒక నాడు రాజుఆలయ దర్శనానికి వస్తున్నారని తెలిసి, వారకాంత మెడలోని పూలమాలను శివలింగంపై వేస్తాడు. ఆ పూలమాలను రాజు కంఠాన అలంకరించినప్పుడు, అందులో ఒక వెంట్రుక ఆయనకు గోచరించింది. స్వామికి కొప్పు ఉందని మరుసటిచూపుతానని అర్చకుడు రాజుకు చెబుతాడు. ఆ రాత్రి అర్చకులని ప్రార్థనలు ఆలకించిన ఈశ్వరుడు శివలింగానికి కొప్పు వచ్చేటట్టు చేస్తాడు. ఆ రోజునుంచి ఆలయానికి ఉమాకొప్పేశ్వరస్వామి ఆలయమనే పేరు వాడుకలోకి వచ్చింది. 
 

Advertisement
Advertisement