నేరాలకు అడ్డా | Sakshi
Sakshi News home page

నేరాలకు అడ్డా

Published Tue, Mar 14 2017 11:42 PM

నేరాలకు అడ్డా - Sakshi

 
  • రాజమహేంద్రవరం మెయిన్‌రోడ్డులో పెరుగుతున్న క్రైం
  • చెలరేగిపోతున్న జేబుదొంగలు, దోపిడీ ముఠాలు
  • వరుస నేరాలతో బెంబేలెత్తుతున్న వ్యాపారులు
  •  
 
సాక్షి, రాజమహేంద్రవరం :
ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం మెయిన్‌ రోడ్డులోని ఓ ప్రాంతం దొంగల ముఠాల కు, జేబుదొంగలకు అడ్డాగా మారింది. ఇక్కడి నల్లమం దు సందు ఎంట్రన్‌, రోజ్‌మిల్క్‌ సెంటర్‌లలో మాటు వేసిన దొంగలు.. అదును చిక్కినప్పుడు ప్రజలను, వ్యా పారులను దోచుకుంటున్నారు. వ్యాపారులు, కొనుగోలుదార్లు, పోలీసులు తేరుకొనేలోపే దొంగలు పని పూర్తి చేసుకొని పరారవుతున్నారు. మెయిన్‌ రోడ్డులోని నల్లమందు సందు పరిసరాల్లో అధిక సంఖ్యలో బంగా రు దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని గంటాల మ్మ గుడి వీధిలోని ఓ బంగారు నగలకార్ఖానాలో గత గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ దోపిడీ ముఠా రెచ్చిపోయింది. బంగారు నగలు తయారు చేసే ముసుగులోనే బెంగాల్‌కు చెందిన ఆ ముఠా దోపిడీకి పాల్పడడం, అందుకోసం తుపాకులు, కత్తులు, ఇతర మారణాయుధాలు ఉపయోగించడం కలకలం రేపింది. దొంగలను పట్టుకునేందుకు ఆయా దుకాణాల్లో పని చేసే యువకులు యత్నించడంతో దోపిడీ ముఠాకు చెందిన ఓ వ్యక్తికి కత్తి గాయం కూడా అయ్యింది. లేదంటే పట్టుకునేందుకు యత్నించిన యువకుల ప్రాణాలకే ప్రమాదమొచ్చేది. ఈ ఘనటతో మరోసారి మెయిన్‌ రోడ్డులోని బంగారు, ఇతర వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు.
వందలాదిగా దుకాణాలు, కార్ఖానాలు
మెయిన్‌  రోడ్డులోని ఇసుకవీధి, నల్లమందు సందు, గుండువారి వీధి, చందా సత్రం వీధి, గంటాలమ్మ గుడి వీధి ప్రాంతాల్లో దాదాపు 200 బంగారు దుకాణాలున్నాయి. ఇవి కాకుండా బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలు దాదాపు 500 ఉన్నాయి. వీటిలో బంగారు నగలు తయారు చేసేవారు (గోల్డ్‌స్మిత్‌లు) దాదాపు 10 వేల మంది ఉన్నారు. ఇందులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోల్డ్‌ స్మిత్‌లు దాదాపు 3 వేల మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ గోల్డ్‌స్మిత్‌ల మాటున ఆ రాష్ట్రానికి చెందిన కొందరు నేరగాళ్లు ఇక్కడ కొద్ది రోజులు నమ్మకంగా పని చేస్తున్నారు. వారిని నమ్మి స్థానిక బంగారు దుకాణ యజమానులు ముడి బంగారం ఇచ్చి నగలు చేయించుకుంటున్నారు. తరుగు, కూలి చెల్లిస్తున్నారు. పెద్ద మొత్తంలో బంగారం వచ్చినప్పుడు కార్ఖానాలో పని చేస్తున్న పశ్చిమ బెంగాల్‌ నేరగాళ్లు ఆ బంగారంతో పరారవుతున్నారు. ఫలితంగా ఉపాధి కోసం వచ్చి ఇక్కడ నిజాయితీగా పని చేసుకుంటున్న ఆ రాష్ట్ర గోల్డ్‌స్మిత్‌లు ఇబ్బందిపడుతున్నారు. దోపిడీ దొంగలకు ఇక్కడ పెద్ద వ్యాపారాలు చేస్తున్న కొందరు పశ్చిమ బెంగాల్‌ వ్యాపారులు, స్థానిక వ్యాపారులు కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
గతంలోనూ..
ఆరు నెలల కిందట దేవ్‌ అనే పశ్చిమ బెంగాల్‌ గోల్డ్‌ స్మిత్‌ ఏడు కేజీల బంగారంతో పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. కానీ స్థానికంగా పెద్ద వ్యాపారిగా పేరున్న ఓ పశ్చిమ బెంగాల్‌ వ్యాపారి సోదరుడు తాము రాజీ చేస్తామని చెప్పి అతడిని విడిపించుకుపోయాడు. వ్యాపారులు కూడా తమ సొమ్ము వస్తే చాలనుకుని రాజీకి సిద్ధమయ్యారు. ఏడు కేజీల బంగారంలో 5 శాతం మాత్రమే రికవరీ అయ్యింది. ఆ కేసు ఇప్పటివరకూ తేలలేదు. గతంలో కూడా ఇలాగే అనేక ఘటనలు జరిగాయి. కొంతమంది స్థానిక గోల్డ్‌స్మిత్‌లు కూడా ఇలాగే కొద్దిపాటి బంగారంతో పరారైన ఘటనలున్నాయని బంగారు వ్యాపారులు చెబుతున్నారు. అయితే వారిలో కొంతమంది తిరిగి వచ్చి ఎవరి బంగారం వారికి ఇచ్చి యథావిధిగా పని చేసుకుంటున్నారు. మరికొంత మంది పరారీలోనే ఉన్నారు.
అర్ధాంతరంగా ఆగిన సీసీ కెమెరాల ఏర్పాటు
నల్లమందు సందు ప్రారంభం, రోజ్‌మిల్క్‌ సెంటర్, బంగారు నగల దుకాణాల కూడలిలో ఇతర నేరాలు కూడా అధికంగా ఉన్నాయి. మెయిన్‌ రోడ్డు ఒకటి, రెండు, మూడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోకి వస్తోంది. ఈ మూడు స్టేషన్లలో నెలకు దాదాపు 15 జేబు దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. నేరాలను అదుపు చేసేందుకు, నేరగాళ్లను గుర్తించేందుకు ఈ కూడలిలో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్, నాలుగువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2015లో అప్పటి సెంట్రల్‌ డీఎస్పీ నామాల బాబ్జీ భావించారు. ఈ మేరకు బంగారం వ్యాపారులతో చర్చించారు. వారు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ భవనం శ్లాబ్‌ దశలో ఆగిపోయింది. ఈలోగా బాబ్జీ బదిలీపై వెళ్లిపోయారు. ఆ చిన్నపాటి భవనం ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని భావించిన నగరపాలక సంస్థ దానిని తొలగించింది. దీంతో ఆ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది.
 
 
 

Advertisement
 
Advertisement