రంజాన్ స్పెషల్ చాయ్ ఘావా | Sakshi
Sakshi News home page

రంజాన్ స్పెషల్ చాయ్ ఘావా

Published Wed, Jun 22 2016 3:02 AM

రంజాన్ స్పెషల్ చాయ్ ఘావా

రంజాన్ ప్రత్యేకం
స్టేషన్ మహబూబ్‌నగర్: అరబ్ దేశపు చాయ్ ‘ఘావా’కు రంజాన్ మాసంలో భలే డిమాండ్ ఉంటోంది. మహబూబ్‌నగర్‌తో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వీటిని ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఘావా అంటే అరబ్ భాషలో వివిధ ఔషధాల మిశ్రమం అని అర్థం. వెయ్యేళ్లకు పూర్వం అరబ్ దేశం యెమన్‌లో షాజిలీ, ఖామిరి అనే ఇద్దరు ధర్మపండితులు రాత్రిపూట దైవనామస్మరణ (జాగరణ)లో గడపడానికి ఈ వేడి పానీయాన్ని తయారు చేసి వాడడం మొదలుపెట్టారు. దీనికి ‘ఘావా’ అని పేరు పెట్టారని చెబుతారు.

ఆరోనిజాం మీర్ మహబూబ్ అలీ కాలంలో ప్రభుత్వ మిలట్రీ కోసం యెమన్ నుంచి అరబ్‌లను ఇక్కడికి తీసుకొచ్చి వారికి రక్షణ సంబంధిత బాధ్యతలను అప్పగించారు. వీరి ద్వారా హైదరాబాద్‌లో ఘావా ప్రారంభమైందని చెబుతారు.
 
ఘావా తయారీ ఇలా...
కాఫీ పొడి, సొంటి, ఎండు అల్లం, దాల్చిన చెక్క, జాఫ్రాన్, యాలకులను నూరి పౌడర్‌లా తయారుచేస్తారు. దీనిని వేడినీటిలో నింపడంతో ఘావా తయారవుతుంది. ప్రస్తుతం ఘావా, బెల్లం ఘావా, పాల ఘావా, లెమన్ ఘావాలనే మూడు రకాలలో లభ్యమవుతోంది. అరబ్‌లు ఉన్నచోట ఘావా తప్పక ఉంటుంది. వారి దినచర్యలో దీనికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. రంజాన్‌మాసంలో ఘావా ఎక్కువగా ఉంటోంది.
 
ఇవీ ప్రయోజనాలు..
ఘావా తాగడం ద్వారా జీర్ణశక్తి పెరగడంతో పాటు మలబద్దకం దూరమవుతుంది. జలుబు తగ్గుతుంది, పరగడుపున ఘావా తాగడం ద్వారా ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో రంజాన్ ఉపవాసాలను ఇఫ్తారు దీక్షను ఘావా, ఖర్జూరంతో విడవడం ఆనవాయితీగా వస్తోంది.
 
మార్కెట్‌లో...
జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్, మదీనా మజీద్ రోడ్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, న్యూటౌన్ తదితర ప్రాంతాల్లో ఘావా దుకాణాలు వెలిశాయి. యువకులు, మహిళలు, వృద్ధులు ఘావా తాగేందుకు ఇష్టపడుతారు. పాల ఘావాకు మంచి ఆదరణ ఉంది. అన్ని వయస్సుల వారు దీనిని వాడుతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు కూడా ఆయా స్టాళ్లలో ఘావాను విక్రయిస్తున్నారు.
 
మోతీ మజీదు
జిల్లాకేంద్రం బోయపల్లిగేట్ సమీపంలో మోతీ మసీదు కు 90ఏళ్ల చరిత్ర ఉందని స్థానిక మత పెద్దలు చెబుతున్నారు. ఈ మసీదు నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకేసారి మసీదులో వెయ్యిమంది నమాజ్  చేయవచ్చు.
- స్టేషన్ మహబూబ్‌నగర్

Advertisement
Advertisement