సిండికేట్‌గా రేషన్‌ మాఫియా | Sakshi
Sakshi News home page

సిండికేట్‌గా రేషన్‌ మాఫియా

Published Sun, Oct 16 2016 5:05 PM

సిండికేట్‌గా రేషన్‌ మాఫియా

రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించి అమ్ముకోవడం కొత్తేమీ కాదు.. ఏళ్ల తరబడి కొనసాగుతున్నదే.. రెండేళ్ల కిందటి వరకు ఇలా పేదల బియ్యాన్ని బొక్కే దొంగలంతా విడివిడిగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుడొకరు వీరినందరినీ ఒక తాటిపైకి తెచ్చాడు. ఆ విధంగా రేషన్‌ డీలర్ల మాఫియా తయారైంది. అధికారులు వారికి జీ హుజూర్‌ అంటున్నారు. ఇక రేషన్‌ దోపిడీ పట్టపగ్గాలు లేకుండా సాగుతోంది.
 
మాచర్ల: నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేయకుండానే డీలర్లు సిండికేట్‌గా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నాయకులకు అమ్మేస్తున్నారు. తాజాగా శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 52 బస్తాల రేషన్‌ బియ్యాన్ని ఎస్‌ఐ రామాంజనేయలు స్వాధీనపర్చుకుని కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పీఆర్కే బియ్యం లారీని పట్టించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడవకముందే మరోసారి రేషన్‌ బియ్యం దొరికాయి. దీనినిబట్టి అధికార పార్టీకి చెందిన నాయకుల అక్రమ వ్యాపారం ఎలా సాగుతోందో అర్థమవుతోంది.
 
దందా నడిపిస్తున్న నామినేటెడ్‌ నాయకుడు..
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ వర్గాలుగా వున్న రేషన్‌ బియ్యం అక్రమ రవాణాదారులందరినీ తన కనుసన్నలలో ఉంచుకుని ఓ నామినేటెడ్‌ నాయకుడు దందాను నడిపిస్తున్నాడు. ఈ విషయంపై ఎమ్మెల్యే పీఆర్కే పలుమార్లు ఆరోపణలు కూడా చేశారు. వారం  కిందట దుర్గి మండలంలోని అడిగొప్పల ప్రాంతంలో 420 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనపర్చుకుని పోలీసులకు పట్టించారు. అయినప్పటికీ పోలీసులు అధికార పార్టీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి దొరికిన డ్రైవర్‌పైనే కేసులు నమోదు చేసి అసలు సూత్రధారులను గాలికొదిలేశారనే  ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే పీఆర్కే అక్రమ రేషన్‌ బియ్యం లారీని పట్టుకున్న సమయంలో దొరికిన ఐదుగురు మినహా మిగతా వారు ఎవరనేది పోలీసులు తేల్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. దుర్గి మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరి పేర్లను నమోదు చేశామని చెబుతున్నా, వారిని అరెస్టు చేశారా లే దా అనే విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా శుక్రవారం మాచర్ల శివారులో గుంటూరు రోడ్డులోని రాయవరం జంక్షన్‌ వద్ద 52 బస్తాల బియ్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. ఈసారీ డ్రైవర్‌ ఒక్కడిపైనే కేసు నమోదు చేశారు. అసలు నిందితులను తేల్చకుండా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. 
 
పథకం ప్రకారం డంపింగ్‌..
అధికార పార్టీ నాయకులు ముందుగా వివిధ మండలాల నుంచి రేషన్‌ బియ్యాన్ని తీసుకువచ్చి ఒక చోట డంప్‌ చేస్తారు. అక్కడ నుంచి వివిధ చోట్లకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతుంటుంది. పోలీసు పెట్రోలింగ్‌ చేసే సమయంలోనే  లోడ్‌లను తీసుకెళ్తున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా రూరల్‌ æపరిధిలోని ఓ పోలీసు అ«ధికారి అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు బియ్యం పట్టుకున్న ప్రతిసారీ దొరికిన వారిపై కేసులు పెట్టి  చేతులు దులుపుకొంటున్నారు. కీలక సూత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదు.

Advertisement
Advertisement