ఇలాంటి ప్రభుత్వాలొస్తాయని రావిశాస్త్రి ఊహించలేదు | Sakshi
Sakshi News home page

ఇలాంటి ప్రభుత్వాలొస్తాయని రావిశాస్త్రి ఊహించలేదు

Published Sat, Jul 30 2016 11:07 PM

ఇలాంటి ప్రభుత్వాలొస్తాయని రావిశాస్త్రి ఊహించలేదు

సాక్షి, విశాఖపట్నం: ఉన్నదున్నట్టు, నిఖార్సుగా నిర్భయంగా రావిశాస్త్రిలా రాసే రచయితలు నేటి సమాజం, సాహితీ లోకం, పత్రికలు, టీవీల్లోనూ లేరని సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి అన్నారు. నేడు రావిశాస్త్రిలాంటి రచయితలుంటే అణువిద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటయ్యేవి కావని, గోమాంసం తిన్నారని ముస్లింలను హత్య చేసే వికారపు ఘటనలపై స్పందించే వారన్నారు. ఆయన హయాంలో ఇలాంటివి లేవని, ఇలాంటి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని, ఇలాంటి భావజాలం దేశంలో బలంగా వ్యాప్తిస్తుందని అప్పట్లో ఆయన ఊహించి ఉండరని చెప్పారు. శనివారం సాయంత్రం విశాఖ పౌరగ్రంథాలయంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి 95వ జయంతి సందర్భంగా రావిశాస్త్ర్రి లిటరరీ ట్రస్టు ఆవిర్భావం, అవార్డు ప్రదానోత్సవ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బోలెడంత ఘర్షణ జరుగుతున్నా పత్రికల్లో దానికి అద్దం పట్టేలా రాసేవారూ లేరని, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ రాసే అవకాశం లేదని పేర్కొన్నారు. షేక్‌స్పియర్‌ అంతటి గొప్ప రచయితలు మనకు లేకపోవచ్చు గాని తెలుగుసాహిత్యంలో అంతటి దిగ్గజాలున్నారన్నారు. నేటి తరం రచయితలు, సాహితీవేత్తలు రావిశాస్త్రిని స్ఫూర్తిని తీసుకోవాలని కోరారు. సాహిత్యంలోనూ, రాజకీయాల్లోనూ, సమాజంలోనూ గొప్ప సేవ చేసిన వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకునే సంప్రదాయం తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నీలం సంజీవరెడ్డి, చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాథం వంటి మహనీయుల గురించి వారి కుటుంబాలు గాని, సమాజం గాని స్నేహితులు గాని తలచుకునే అవకాశం లేదన్నారు.అపర చాణక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన ఎనిమిదేళ్ల వరకు ఆయన సంతాప సభ జరగలేదని గుర్తు చేశారు. మొదటి సంతాప సభను తానే నిర్వహించానని, ఆ సభకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారని చెప్పారు. పీవీతో తనకు బంధుత్వం లేకపోయినా సాన్నిహిత్యం ఉందన్నారు. ఆయన కుమారులకు సంతాప సభలు నిర్వహించే శక్తి, సామర్థ్యాలున్నా వారికా సంకల్పం లేదన్నారు. విశ్వనాథ సత్యనారాయణ జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ప్రయత్నాలు జరగలేదన్నారు. రావిశాస్త్రి గురించి అలాంటి ప్రయత్నాలు జరిగినందుకు, ఆయన పేరిట లిటరరీ ట్రస్టు ఏర్పాటు, అవార్డులివ్వడం వంటివి చేయడం అభినందనీయమని చెప్పారు. ఇలాగే తెలుగు భాషకు సేవచేసిన వారికి పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. ఒక భాషపై అధికారం సంపాదించిన వారికి ఇంకో భాషపై పట్టు సాధంచడం పెద్ద కష్టం కాదని పేర్కొన్నారు. 
 రామతీర్థకు రావిశాస్త్రి అవార్డు ప్రదానం 
తొలుత రావిశాస్త్రి లిటరరీ ట్రస్టును రామచంద్రమూర్తి ప్రారంభించారు. అనంతరం రచయిత, కవి రామతీర్థకు రావిశాస్త్రి పేరిట నెలకొల్పిన తొలి అవార్డును ప్రదానం చేశారు. అనంతరం రావిసారాలు వ్యాస సంపుటిని, ఆంగ్లంలో రచించిన ’రాకంటూర్‌ రాచకొండ’ పొట్టి పిట్టకధల సంపుటిని ఆవిష్కరించారు. వేడుకగా జరిగిన ఈ సాíß తీ కార్యక్రమంలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు, ఆచార్య చందు సుబ్బారావు, రావిశాస్త్రి కుమారులు ప్రసాద్, ఉమాకుమారశాస్త్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్‌.ఆర్‌.స్వామి, రచయితలు జగద్ధాత్రి, శిబానంద కల్యాణ రామారావు, జయశీలరావు, డీవీ సూర్యారావు, పేరి రవికుమార్, మంగు శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement