మా పిల్లల గోస తగులుతది | Sakshi
Sakshi News home page

మా పిల్లల గోస తగులుతది

Published Fri, Jul 29 2016 10:54 PM

మా పిల్లల గోస తగులుతది

  • ఆర్డీవోను అడ్డుకున్న భూనిర్వాసితులు
  • కాంట్రాక్టర్‌ క్యాంపు ఆఫీస్‌ ఫర్నిచర్‌ బయట పడేసి ఆందోళన
  • ఆఫీసుకు తాళం వేసిన ముంపు బాధితులు
  • హుస్నాబాద్‌రూరల్‌: ‘మా పిల్లల గోసతగిలి పోతరు. ఏడేళ్ల నుంచి ఎవుసం చేసుకోనియ్యకుండ మమ్ములను తిప్పల పెట్టిండ్రు. మా భూములకు పరిహారం ఇయ్యాలంటే మీ ఇంట్లకెల్లి ఇచ్చినట్లు చేస్తుండ్రు. మా పిల్లలు ఎట్ల బతకాలే?. తెలంగాణ అచ్చినంక పెరిగిన జీతాలు మీరు తీసుకోలదా?. మాకు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వమంటే మీ అయ్య సొమ్ము ఇచ్చినట్లు చేస్తుండ్రు. భూములు ఇచ్చుడు లేదు. ఇక్కడ డ్యాం కట్టుడు లేదు. ఊళ్లకెళ్లి ఎల్లుండ్రి.’ అని గౌరవెల్లి ముంపు బాధితులు కరీంనగర్‌ ఆర్డీవో చంద్రశేఖర్‌ బృందంను అడ్డుకున్నారు. శుక్రవారం ఆర్డీవో, ప్రాజెక్టు ఈఈ రాములు నాయక్‌ ఇతర అధికారులు నిర్వాసితులతో మాట్లాడేందుకు గుడాటిపల్లికి వచ్చారు. ప్రభుత్వం కల్పించే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై మాట్లాడేందుకు పంచాయతీవద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఏ ఒక్క రైతు అధికారుల వద్దకు వెళ్లలేదు. దీంతో అధికారులు నిర్వాసితులు చేపట్టిన దీక్షవద్దకు చేరుకొని మాట్లాడేందుకు ప్రయత్నించారు. పట్టించుకోని రైతులు మదిలోని బాధను అధికారులకు వెల్లడించారు. స్పందించిన ఆర్డీవో చంద్రశేఖర్‌ మీ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. జీవో 123 ప్రకారం ప్రభుత్వం న్యామైన పరిహారం అందజేస్తుందని చెప్పారు. వినిపించుకోని నిర్వాసితులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలా అయితేనే ముందుకురావాలని తేల్చిచెప్పారు. 
     
    కాంట్రాక్టర్‌ క్యాంపు ఆఫీస్‌కు తాళం..
    అనంతరం రైతులు కాంట్రాక్టర్‌ క్యాంపు ఆఫీసుకు వెళ్లి అందులోని ఫర్నిచర్‌ను బయటపడేశారు. డ్యాం పనులు చేయొద్దని కూలీలకు హెచ్చరించారు. న్యామైన పరిహారం అందేవరకు పని ముట్టుకోవద్దని కార్యాలయానికి తాళం వేశారు. కూలీలను వెళ్లగొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో సర్పంచ్‌ తాట్ల యాదమ్మ, ఎంపీటీసీ కనకయ్య, మల్లారెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
     
     

Advertisement
Advertisement