సిద్ధమవుతోంది..!

28 Jul, 2016 22:49 IST|Sakshi
కొలిక్కి వస్తున్న గొందిమల్ల ఘాట్‌ పనులు
 •  కొలిక్కి వస్తున్న వీఐపీ ఘాట్‌ నిర్మాణం 
 •  నిర్మాణంలోనే రెండో ఘాట్‌
 •  నత్తనడకన రోడ్డు నిర్మాణాలు 
 • అలంపూర్‌: కృష్ణా పుష్కరాల కోసం నిర్మిస్తున్న వీఐపీ ఘాట్‌ పనులు కొలిక్కి వస్తున్నాయి. అలంపూర్‌ క్షేత్రానికి అతి సమీపంలోని గొందిమల్లలో వీఐపీలకు, సాధారణ భక్తుల కోసం ఘాట్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. నదిలో నీటి ప్రవాహాల అంచనాలకు అనుగుణంగా రెండు ఘాట్లను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఒక ఘాట్‌ నిర్మాణాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. కానీ నీటి ప్రవాహం పెరిగినా పుష్కర స్నానాలు చేయడానికి వీలుగా నిర్మిస్తున్న రెండోఘాట్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పుష్కరాలకు కేవలం 14రోజుల గడువు మాత్రమే ఉండటంతో పనుల హడావుడి పెరిగింది. 
   
  రెండేసి ఘాట్ల నిర్మాణం..
  గొందిమల్లలో నీటి నిల్వల హెచ్చు తగ్గులను దృష్టిలో ఉంచుకుని రెండు ఘాట్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకటి లో–లెవల్‌ ఘాట్‌ మరొకటి హై–లెవల్‌ ఘాట్‌లను రూ.3.17 కోట్లతో వ్యయంతో నిర్మిస్తున్నారు. లోలెవల్‌ ఘాట్‌ నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ పుష్కర స్నానాలు ఆచరించడానికి వీలుగా నిర్మిస్తున్నారు. 30మీటర్ల వెడల్పు, 90 మీటర్ల పొడవుతో దీని నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా ఘాట్‌ పనులు పూర్తి చేసి, ఘాట్‌కు రంగు బిల్లలు వేసే పనులు కొనసాగుతున్నాయి. అయితే నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటే ఘాట్‌కు దాదాపు 30మీటర్ల దూరంలో నీళ్లు ప్రవహిస్తాయి. ఇటీవల ఘాట్‌ పరిశీలనకు వచ్చిన మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు ఈ విషయమై చర్చించారు. నీళ్లు ఘాట్‌కు దూరంగా ఉంటంతో మరో 20అడుగుల ఘాట్‌ను నదిలో నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం పెరగడంతో అదనంగా పెంచాల్సిన ఘాట్‌ పనులపై సందిగ్ధం నెలకొంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా నీటి నిల్వలు పెరిగితే ప్రస్తుతం నిర్మిస్తున్న ఘాట్‌ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయంగా హైలెవల్‌ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. లోలెవల్‌ ఘాట్‌ ఎత్తు నుంచి ఈ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. 
   
  జోగుళాంబ ఘాట్‌గా నామకరణం.. 
  అలంపూర్‌ క్షేత్రానికి అతీ సమీపంలో గొందిమల్లలో నిర్మిస్తున్న ఘాట్‌కు జోగుళాంబ పేరుతో పిలవనున్నారు. ఇటీవల పుష్కరఘాట్‌ల సందర్శనకు వచ్చిన కలెక్టర్‌ టీకే శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘాట్‌లో పుష్కరస్నానాలు ఆచరించే భక్తులు నేరుగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వస్వామి క్షేత్రాన్ని సందర్శించుకునే అవకాశం ఉంది. దీంతో ఈ ఘాట్‌కు జోగుళాంబ ఘాట్‌గా నామకరణం చేశారు. యాత్రికులు ఒక మార్గంలో వచ్చి రెండో మార్గంలో వెళ్లడానికి వీలుగా ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇతర సదుపాయాలపైనే ఆయా శాఖలు పనుల్లో నిమగ్నమయ్యాయి. 
   
   
   
   
మరిన్ని వార్తలు