సాగునీరు అందించి పంటలు కాపాడండి | Sakshi
Sakshi News home page

సాగునీరు అందించి పంటలు కాపాడండి

Published Wed, Oct 26 2016 10:18 PM

సాగునీరు అందించి పంటలు కాపాడండి - Sakshi

వత్సవాయి : సాగునీరు అందించి పంటలను కాపాడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. బుధవారం మండలంలోని మక్కపేట గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలలో కలిపి మొత్తం లక్షా 18 ఎకరాల సాగర్‌ ఆయకట్టు ఉందన్నారు. గడచిన రెండేళ్లలో సాగర్‌ నీరు రాకపోవడంతో చేతికి వచ్చిన పంటలు దక్కకుండా పోయాయని తెలిపారు. జగ్గయ్యపేటకు కూతవేటు దూరంలో ఉన్న నల్గొండ జిల్లా కోదాడ, ఖమ్మంతోపాటు మధిర వరకు సాగర్‌ జలాలు వస్తున్నా జిల్లాకు రావడం లేదన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తి సాగునీటి శాఖా మంత్రిగా ఉన్నా సాగర్‌ నీరు రాకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. కుడి కాలువకు నీటిని విడుదల చేసినా మన ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు లేదన్నారు. వెంటనే ఎడమకాలువకు నీటిని విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పత్తి, మిర్చి, వరి పంటలకు నీరు అవసరమన్నారు. సాగునీరు అందుబాటులో లేకపోవడంతో రైతులు దూర ప్రాంతాల నుంచి ఆయిల్‌ ఇంజన్లతో పైపుల ద్వారా నీరు పెట్టుకుంటున్నారన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు జూలై నెలలో సాగర్‌ నీరు రాగా రాష్ట్ర విభజన తర్వాత నీరు రావడంలేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్‌(చిన్నా), పార్టీ మండల కన్వీనర్‌ గాదెల రామారావు, మండల పార్టీ నాయకులు కనగాల రమేష్, కొండబోలు నారాయణరావు, గిరిజన సంఘ నాయకులు గుగులోతు కోటయ్య, పెనుగొండ రామకోటి, పగడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.




 

Advertisement

తప్పక చదవండి

Advertisement