ఒరిజినల్ నోట్లను గుర్తించండిలా | Sakshi
Sakshi News home page

ఒరిజినల్ నోట్లను గుర్తించండిలా

Published Sat, Sep 10 2016 11:38 PM

ఒరిజినల్ నోట్లను గుర్తించండిలా - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: భారత్‌కు చెందిన నకిలీ కరెన్సీని ప్రింట్‌ చేయడానికి పాకిస్థాన్‌లోని క్వెట్టాలో ప్రత్యేక పవర్‌ ప్రెస్‌ ఏర్పాటు చేసిన పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అసలు నోట్లకు దీటుగా వీటిని ముద్రిస్తోంది. ఈ నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నప్పటికీ... మూడు సెక్యూరిటీ ఫీచర్స్‌లో మాత్రం స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మరోపక్క నోట్ల క్వాలిటీ పెరుగుతోంటే... వాటి మార్పిడి రేటు సైతం పైపైకి వెళ్తోంది.

సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన అంతరాష్ట్ర ముఠా విచారణలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ వ్యక్తులు ఈ నకిలీ కరెన్సీని కంటితో చూసి నకిలీదని గుర్తించడం సాధ్యం కాదు. నకిలీ నోట్ల ముద్రణ, చెలామణిని అడ్డుకోవడానికి ఆర్బీఐ కరెన్సీ నోట్లపై 10 సెక్యూరిటీ ఫీచర్స్‌ పొందుపరుస్తుంది.

వీటిలో ఏడింటిని కాపీ చేస్తున్న పాక్‌... మూడింటిని మాత్రం ముద్రించలేకపోతోంది. వ్యాపారులు, సాధారణ ప్రజలు వీటిని దృష్టిలో పెట్టుకుంటే నకిలీ నోట్లను తేలిగ్గా గుర్తించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఆ మూడు ఇవే..

సెక్యూరిటీ థ్రెడ్‌
కరెన్సీ నోటుకు ముందు వైపు మధ్యలో ఆ నోటు విలువ అంకెల్లో ముద్రితమై ఉంటుంది. దీనికి కుడివైపున నోటు లోపలకు, బయటకు కనిపిస్తూ ఓ చిన్న పట్టీ ఉంటుంది. సిల్వర్‌ బ్రోమైడ్‌తో తయారయ్యే దీనిపై ఆర్బీఐ అంటూ ఆంగ్లం, హిందీ భాషల్లో చిన్న అక్షరాలతో రాసి ఉంటే ఈ «థ్రెడ్‌ సాధారణంగా నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తూ ఉంటుంది. నకిలీ కరెన్సీపై ఆర్బీఐ మార్క్‌ ఉన్నప్పటికీ... ఈ థ్రెడ్‌ సిల్వర్‌ కోటెడ్‌ అయి ఉండి, కేవలం ఆకుపచ్చ రంగు మాత్రమే ఉంటుంది.

వర్టికల్‌ బ్యాండ్‌
కరెన్సీ నోటు ముందు వైపు దాని కుడి పక్కగా గాంధీజీ ఫొటో ముద్రితమై ఉంటుంది. నోటుకు కుడి చివరగా (గాంధీ ఫొటోను వెనుక వైపుగా) డిజైన్‌తో కూడిన నల్లని పట్టీనే వర్టికల్‌ బ్యాండ్‌ అంటారు. ఇందులో అంతర్గతంగా ఆ కరెన్సీ నోటు విలువ అంకెల్లో ముద్రితమై ఉంటుంది. నోటును వెలుతురు వైపు ఏటగావుగా (45 డిగ్రీల కోణంలో) పెట్టి చూస్తే ఇది కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ వర్టికల్‌ బ్యాండ్‌ ఉన్నప్పటికీ... ఏటవాలుగా చూసినా అందులో కరెన్సీ విలువ కనిపించదు.

వాటర్‌ మార్క్‌
కరెన్సీ నోటుకు ముందు వైపు ఎమడ వైపు తెల్లని ప్రదేశం ఉంటుంది. నోటు విలువ అంకెల్లో వేసి ఉన్న ప్రాంతాన్ని తాకుతూ ఉండే దీనికి పై వైపున చిన్న అంకెల్లో కరెన్సీ విలువ, కింది వైపున జాతీయ చిహ్నం ముద్రించి ఉంటాయి. ఈ వాటర్‌ మార్కును వెలుతురులో పెట్టిచూస్తే అందులోనూ గాంధీజీ ఫొటో కనిపిస్తుంటుంది. దాదాపు మొత్తం ప్రాంతానికి సరిపోతూ నిండుగా ఉంటుంది. నకిలీ నోట్లలోనూ ఈ వాటర్‌మార్క్‌లో గాంధీజీ ఫొటో ఉన్నప్పటికీ... దాని చుట్టూ ఖాళీ ఎక్కువగా ఉంటుంది.

క్వాలిటీతో పాటే పెరిగిన ‘కమీషన్‌’...
నకిలీ కరెన్సీ డంప్‌ చేసి చెలామణి చేయించడం ద్వారా పాకిస్థాన్‌ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. కరాచీ నుంచి మల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్‌ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. సాధారణంగా హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడిన రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు.

ఏళ్ళుగా ఇదే రేటు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కమీషన్‌ పెరిగింది. కరెన్సీ నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలోనే ఈ కమీషన్‌ కూడా పెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్‌కు మాల్దాకు చెందిన బబ్లూ 1:2 రేషో్యలో (రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు) ఇచ్చినట్లు వెల్లడైంది.

నాసిక్‌లోని పవర్‌ ప్రెస్‌కు నమూనాలు...
సాధారణంగా నకిలీ కరెన్సీ కేసుల్ని పోలీసులు ఐపీసీలోని సెక్షన్‌ 489 కింద నమోదు చేస్తారు. అయితే శుక్రవారం చిక్కిన ముఠాపై తొలిసారిగా నకిలీ కరెన్సీ కేసును అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ (యూఏపీఏ) కింద నమోదు చేశారు. ఇకపై ఈ తరహా కేసుల్ని ఈ చట్ట ప్రకారమే నమోదు చేయాలని నిర్ణయించారు. అయితే ఇలా నమోదు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న కరెన్సీని విలేకరుల సమావేశంలో బయటకు ప్రదర్శించకూడదు.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాటి విలేకరుల సమావేశంలోనూ ఈ నోట్లను బహిరంగంగా చూపించకుండా సీల్‌ చేసిన బాక్సులో ఉంచారు. మరోపక్క 48 గంటల్లో కోర్టు ద్వారా నకిలీ కరెన్సీని మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న భారత పవర్‌ ప్రెస్‌కు పంపి పరీక్షలు చేయించారు. అక్కడి అధికారులు గరిష్టంగా 15 రోజుల్లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు ఆ సన్నాహాలు ప్రారంభించారు.

Advertisement
Advertisement