ఎర్ర చక్కెర కేళి ధర పతనం | Sakshi
Sakshi News home page

ఎర్ర చక్కెర కేళి ధర పతనం

Published Mon, Aug 29 2016 10:59 PM

ఎర్ర చక్కెర కేళి ధర పతనం

రావులపాలెం :
శ్రావణమాసం అన్ని అరటి రకాలకు కలిసొస్తే ఒక్క ఎర్ర చక్కెరకేళి అరటికి మాత్రం గడ్డుకాలం ఎదురైంది. రావులపాలెం అరటి మార్కెట్‌ యార్డులో నిన్నమొన్నటి వరకూ మిగిలిన రకాలతోపాటు అధిక ధర పలికిన ఈ రకం అరటి ప్రస్తుతం ధర దిగజారడంతో ఆ రైతుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. సుమారు వారం రోజుల క్రితం వరకూ ఈ రకం గెల ఒకటి సైజును బట్టి రూ.250 నుంచి రూ.600 వరకు పలకగా నేడు రూ.150 నుంచి రూ.350కు పడిపోయింది. ఇక్కడ నుంచి ఈ రకం గెలలు ఎక్కువగా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఆ రాష్ట్రంలో ఈ రకం పండించే తిరుచునాపల్లి తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం పంట పుష్కలంగా అందిరావడంతో ఇక్కడ గెలలకు డిమాండ్‌ తగ్గింది. దీంతో సాధారణంగానే ధర తగ్గింది. గతంలో మిగిలిన రకాల అరటి ధరలు ఏ విధంగా ఉన్నా ఎర్ర చక్కెరకేళి ధరలు అధికంగానే పలికేవి. అయితే చిత్రంగా ప్రస్తుతం అన్ని రకాల ధరలు జోరుమీద ఉండగా ఎర్ర చక్కెరకేళి మాత్రం తిరోగమనం పట్టడం ఆ రకం పండిచిన రైతుల్లో నిరుత్సాహం కలిగిస్తోంది. మిగిలిన రకాలు పండించిన రైతులు లాభాలు చవిచూస్తుంటే ఎర్ర చెక్కరకేళి రైతులకు పెట్టుబడులు మాత్రం వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement