కదం తొక్కిన విద్యార్థులు | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన విద్యార్థులు

Published Fri, Jul 22 2016 4:37 PM

కదం తొక్కిన విద్యార్థులు - Sakshi

♦  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి
♦ చేవెళ్లలో హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై రాస్తారోకో
బకాయలను చెల్లించేవరకు పోరాటం ఆగదు- కార్తీక్‌రెడ్డి
♦ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తగదు- యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్‌

చేవెళ్లః విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి, యువజన నాయకులు పి.కార్తీక్‌రెడ్డి తెలిపారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయల చెల్లింపులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో పలు డిగ్రీ, జూనియర్‌ కళాశాలల విద్యార్థులు హైదరాబాద్‌-బీజాపూర్‌ ప్రధాన రహదారిపై  యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ కూతురు కవిత బతుకమ్మ ఆడుకుంటానంటే 20 కోట్లు, హోమాలు, యజ్ఞాలు చేయడానికి 100 కోట్లు, కాన్వాయ్‌లో కొత్త కార్లు కొనడానికి 50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం...విద్యార్థులు చదువుకోవడానికి ఫీజురీయింబర్స్‌మెంట్‌,  స్కాలర్‌షిప్‌ల బకాయలు విడుదల చేయడానికి ఎందుకు చేతులు రావడంలేదని ప్రశ్నించారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నదన్నారు. తెలంగాణ ఉధ్యమానికి విద్యార్థులు కావాలి..కానీ వారికి ఫీజులు చెల్లించడానికి ఎందుకు స్పందించడంలేదని దుయ్యబట్టారు. పైగా కళాశాలలపై విజిలెన్స్‌ దాడులంటూ యాజమాన్యాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నావని పేర్కొన్నారు. కేవలం రెండువేల కోట్లు రూపాయలు విడుదల చేస్తే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయలు తీరుతాయన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక తెలంగాణ కోసం మరోసారి ఉధ్యమించాల్సిన పరిస్థితి వస్తుందని, ఇందుకు విద్యార్థిలోకం సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

విద్యార్ధులు, రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థ విధానాలవల్ల ముఖ్యంగా విద్యార్థులు, రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు మందడి అనీల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. కేసీఆర్‌ పబ్లిసిటీకి, హోర్డింగ్‌లకు పెట్టే ఖర్చు మానేస్తే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయలు తీరుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన కేసీఆర్‌ కుటుంబపాలనలా తయారైందని తెలిపారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగుగాని కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు మాత్రం వచ్చాయన్నారు. కేజీనుంచి పీజీ ఉచిత విద్య, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేబినెట్‌ మొత్తం అటెండర్లమాదిరిగా తయారైందని విమర్శించారు. విద్యార్థుల ఆగ్రహానికి గురికాకముందే విద్యార్థుల బకాయలను విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. డీసీసీ మాజీ అధ్యక్షులు పి.వెంకటస్వామి మాట్లాడుతూ..విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వానికి ఉసురుతగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం పాలన కేసీఆర్‌ దొరల పాలనలా తయారైందన్నారు.

పార్లమెంటు నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు గుడుపల్లి రవికాంత్‌రెడ్డి, కార్యదర్శి పి.మధుసుదన్‌రెడ్డి, నర్సింహ్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎం.రమణారెడ్డి, తదితరులు మాట్లాడుతూ..విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయకపోతే  ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు పి.గోపాల్‌రెడ్డి, శివానందం, మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు టేకులపల్లి శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ పర్మయ్య, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బాలయ్య, మాధవరెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డి, విఠలయ్య, గయాస్‌, భూషన్‌,  జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement