మిగిలింది 48 గంటలే! | Sakshi
Sakshi News home page

మిగిలింది 48 గంటలే!

Published Thu, Jul 28 2016 7:20 PM

మిగిలింది 48 గంటలే!

 
  • హడావుడి లేని అంత్యపుష్కరాలు
  • ప్రభుత్వం చిన్నచూపు
  • గోదావరి వద్ద ఏర్పాట్లు శూన్యం
  • ఈనెల 31న పుష్కరాలు ప్రారంభం
కాళేశ్వరం : గోదావరిలో లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించి ఏడాది పూర్తయింది. పన్నెండు రోజులపాటు నదితీరం మూడు కిలోమీటర్ల మేర భక్తులతో కిక్కిరిసిపోయింది. అప్పుడు అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేశారు. ఆదిపుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ తీసుకొని ఘనంగా నిర్వహించింది. ఈనెల 31 నుంచి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఒక్క గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల హడావుడి కనిపించడంలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అధికారులెవరూ పట్టించుకోవడంలేదు.
 
దేవగురువు బృహస్పతిలో ఒక్కో సంవత్సరం ఒక్కోరాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఆయా రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆరాశిగల నదికి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించడంతో గోదావరినదికి గత ఏడాది జూలై 14 నుంచి 25 వరకు ఆది పుష్కరాలు వచ్చాయి. 12 రోజులు పాటు భక్తజనంతో గోదావరి తీరం కిక్కిరిసింది. దేవ గురువు కన్యారాశిలో ప్రవేశించే సమయం ఆసన్నమైంది. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే చివరి 12 రోజులు అంత్యపుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో ఈనెల 31 నుంచి వచ్చే నెల 11 వరకు గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించనున్నారు. అన్ని నదులకంటే భిన్నంగా గోదావరికి ఏడాది పొడవునా పుష్కరుడు ఉంటాడు. దీంతో ఈ నదిలో ఎప్పుడు స్నానమాచరించినా పుణ్యఫలం దక్కుతుందని వేదపడింతులు పేర్కొంటున్నారు. అయితే ఆదిపుష్కరాల్లో స్నానమాచరించిన వారంతా అంత్యపుష్కరాల్లో స్నానమాచరిస్తారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లేమి చేయకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.
గోదావరి, ప్రాణహిత పరవళ్లు
గోదావరి, ప్రాణహిత నదులు ఎగువ కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో నిత్యం వర్షాల కురుస్తుండం కారణంగా గోదావరి ఉరకలేయనుంది. గజ ఈతగాళ్ల అవసరమూ ఉంటుంది. సూదూరప్రాంతాల నుంచి వచ్చే వారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరిలో నీళ్ళుఅధికంగా ఉన్నాయి.
కనీస వసతులు కరువు..
గతేడాది అన్నిశాఖల అధికారులు సమస్వయంతో పనిచేయడంతో పుష్కరాలు విజవంతమయ్యాయి. ఈసారి అంత్యపుష్కరాలకు ప్రభుత్వ పరంగ ఎలాంటి ఏర్పాట్లు ప్రారంభం కాలేదు. కరీంనగర్‌లో ఈనెల 15న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పుష్కరాల ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. మరునాడు మంథని ఆర్డీవో బాలే శ్రీనివాస్‌ అధ్యక్షతన అన్నిశాఖల అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. అంతే.. ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభంకాలేదు. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. అంత్యపుష్కరాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. 
 
çసమాన ఫలం
– ఫణీంద్రశర్మ, దేవస్థానం అర్చకుడు
ఆదిపుష్కరాల్లో స్నానమాచరించినా.. అంత్యపుష్కరాల్లో ఆచరించినా సమాన పుణ్యఫలం లభిస్తుంది. సంవత్సరమంతా పుష్కరుడు గోదావరిలో ఉండడంచేత గోదావరినదికి అంత్యపుష్కరాలు ఉంటాయి. 12 రోజుల పాటు పిండప్రదానాలు, పితృతర్పణాలు, దానధర్మారలు ఆదిపుష్కరాల మాదిరిగానే చేయొచ్చు.
 
ఏర్పాట్లు చేస్తున్నాం..
 డి.హరిప్రకాశ్‌రావు, కాళేశ్వరం దేవస్థానం ఈవో 
అంత్యపుష్కరాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. రోజుకు 10 వేల మంది పుణ్యస్నానం ఆచరించే అవకాశం ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఆలయానికి చెందిన నిధులే ఖర్చుచేయాలని పై అధికారులు పేర్కొంటున్నారు. 31 వరకు అన్నిశాఖల సమస్వయంతో ఏర్పాట్లు పూర్తిచేస్తాం. భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం.
 

Advertisement
Advertisement