ఒకటి.. రెండయ్యేను..! | Sakshi
Sakshi News home page

ఒకటి.. రెండయ్యేను..!

Published Sun, Jun 19 2016 2:51 AM

ఒకటి.. రెండయ్యేను..!

తెలంగాణలో వేగంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు
తాత్కాలిక జిల్లా కార్యాలయం
మొత్తం 46 మండలాలకు తాజా ప్రతిపాదన
మైనారిటీ గురుకుల భవన సముదాయం ఖాయం
ప్రభుత్వానికి ముసాయిదా సమర్పణ
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై రేపు కొలిక్కి..
రేపు మరోసారి సీఎం కేసీఆర్‌తో కలెక్టర్ భేటీ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజల సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర సమచారాన్ని తయారు చేసి ప్రభుత్వానికి ముసాయిదాను నివేదించారు. ఈ నెల 8న జిల్లాల నుంచి వెళ్లిన ముసాయిదాలపై చర్చించిన సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రెటరీ తదితర ఉన్నతాధికారులు సోమవారం మరోసారి కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఏయే మండలాలు.. ఏఏ జిల్లాలో కలపాలి ? కొత్తగా ఏర్పడనున్న మండలాల సమగ్ర స్వరూపం, మ్యాపులు తదితర వివరాలను తాజాగా శనివారం జిల్లా అధికారులు సీఎం పేషీకి పంపినట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడున్న 36 మండలాలకు తోడు మరో 10 మండలాలను అదనంగా పెంచి... 25 మండలాలతో నిజామాబాద్, 21 మండలాలతో కామారెడ్డి జిల్లాల కొనసాగింపునకు సంబంధించిన వివరాలను అందులో చేర్చినట్లు తెలిసింది. కామారెడ్డిలోని మైనార్టీ గురుకుల భవనంలో తాత్కాలికంగా జిల్లా కేంద్ర కార్యాలయాలను ఏర్పాటును ఖాయం చేశారు. కాగా తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇతర జిల్లాల అధికారుల మల్లగుల్లాలు ఓ పక్కన కొలిక్కి రాకపోగా.. జిల్లాలో ఈ ప్రక్రియ  ముగింపు దశకు చేరగా, తెలంగాణలో మన అధికారులు మొదటిస్థానంలో ఉన్నారు.

రెండు రోజుల్లో వివరాలు..
కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల అంశంపై వివాదాలకు తెరపడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదనలకు ఒకే చెప్పడంతో 20న జరిగే కలెక్టర్ల సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది. మొదట బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, వర్ని మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని కొందరు ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 27న కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ యోగితారాణా తదితరులు ఆర్‌అండ్‌బీ గెస్టుహౌస్‌లో సమావేశం అయ్యారు.

ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా తుది నిర్ణయం జరగలేదని, ప్రజలు అపోహ పడవద్దని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ యోగితారాణాలు ప్రకటనలు విడుదల చేశారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ప్రభుత్వం ఉందని, పాత డివిజన్లను రద్దు చేసే సమస్యే లేదని కూడ పేర్కొన్నారు. దీంతో అందరూ శాంతించడంతో కొత్త మండలాలు, డివిజన్ల ప్రతిపాదనల ముసాయిదాను తాజాగా అధికారులు ప్రభుత్వానికి పంపగా.. సోమవారం చర్చకు రానుంది.

ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లాకు తోడు కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు అవుతుండగా... నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలు,  బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డిలతో కామారెడ్డి జిల్లా ఏర్పడుతుంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్‌లకు తోడు ఇటీవలే ఆర్మూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడగా బాన్సువాడ కూడ రెవెన్యూ డివిజన్ కానుంది. ఈ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10-11 మండలాలకు కొత్తగా ఏర్పడుతున్నాయి.

 కొత్త జిల్లా కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాలిలా..
అక్టోబర్ 11 దసరా నుంచి జిల్లా కార్యాలయాలు పనిచేయాల్సి ఉన్నందున్న కామారెడ్డిలో అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక జిల్లా కార్యాలయాలకు జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని మైనార్టీ గురుకుల భవనాన్ని ఖరారు చేయగా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, మంత్రి, విప్ తదితరులు ఫైనల్ చేశారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న 19 గదులు, మొదటి అంతస్తులో ఉన్న 18 గదులతో పాటు, ఆ భవనం పక్కన ఉన్న రెండు డార్మెటరీలను కార్యాలయాల వసతికై ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ కార్యాలకు కేటాయించాలని నిర్ణయించారు.

ఈ మేరకు కేటాయింపుల వివరాలు కూడ ప్రభుత్వానికి పంపినట్లు తాజా నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయాలతో పాటు సంక్షేమ, కార్పొరేషన్లకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో వసతి కల్పించనున్నారు. అదే విధంగా డీ ఆర్‌డీఏ, మెప్మా, డీఈవో, ఆర్వీఎం, డీవీఈవో, ఆర్‌ఐవో కార్యాలయాలను కూడ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఇవ్వనున్నారు. మొదటి అంతస్తులో ఆర్‌అండ్‌బీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, నీటిపారుదల, ఇంజినీరింగ్ విభాగాలు, జిల్లా పరిషత్, డీపీవో, గనులు, భూగర్భజలాలు, కాలుష్య నివారణ, పరిశ్రమల శాఖలకు కేటాయించనున్నారు.

తాత్కాలికంగా కేటాయించే ఈ గదులలో అధికారులకు ప్రత్యేక క్యాబిన్‌లు ఏర్పాటు చేస్తారు. అలాగే వ్యవసాయ, పట్టు పరిశ్రమ, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, మార్కెటింగ్, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, మార్కెట్ విభాగాలను మార్కెట్‌యార్డు నందు ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. ఒక డార్మెటరీలో సమాచార పౌరసంబంధాల శాఖ విభాగాలు, జిల్లా ఉపాధి కల్పన, సైనిక సంక్షేమం, కార్యాలయాలు, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అన్ని విభాగాలకు మరో డార్మెటరీలో ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో ఉండే దాదాపు 80 ప్రభుత్వశాఖలకు కొత్తగా ఏర్పడే కామారెడ్డి జిల్లాలో తాత్కాలిక వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement