నీటి సమస్య పరిష్కరించండి | Sakshi
Sakshi News home page

నీటి సమస్య పరిష్కరించండి

Published Tue, Mar 28 2017 10:07 PM

నీటి సమస్య పరిష్కరించండి - Sakshi

► అసెంబ్లీలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి

మార్కాపురం : మార్కాపురం నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలోని మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయని తెలిపారు. ఈ ప్రాంతంలో 1000 అడుగుల లోతున బోర్లు వేసినా నీరు పడే పరిస్థితి లేదన్నారు. మంచినీటి సమస్య జనవరి నుంచే ప్రారంభమైందని, నీటి రవాణా కూడా కష్టమై ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) మంజూరు చేయాలని కోరారు.

నియోజకవర్గంలోని పొదిలి, కొనకనమిట్ల మండలాల్లోని 32 ప్రాంతాల్లో రూ.95 కోట్లతో నీటి పథకం, అలాగే మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని 32 ప్రాంతాల్లో రూ.600 కోట్లతో పథకం, మార్కాపురం మండలం ఇడుపూరు, తర్లుపాడు మండలాల్లో సాగర్‌నీరు కవర్‌ కాని ప్రాంతాల్లో రూ.110 కోట్లతో నీటి ఎద్దడి నివారణ కోసం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. పథకాలు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖామంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడిని కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్ల ద్వారా శాశ్వత పరిష్కారానికి మూడు ప్రాజెక్టులు రూపొందించామని, ఇటీవల కేంద్రం ప్రకటించిన పథకంలోగానీ, రాష్ట్ర నిధుల నుంచిగానీ మంజూరు చేయాలని కోరారు. అలాగే బొందలపాడు, తుమ్మలచెరువు రోడ్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌ మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గం ప్రాధాన్యత క్రమంలో ఉందని తెలిపారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

అలానే  అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేయటం మంచిది కాదని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం విజయవాడలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిసి రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేయటం సరికాదన్నారు. గతంలో కృష్ణాజిల్లా తహసీల్దార్‌ వనజాక్షిపై కూడా టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు కేసులు నమోదు చేయకుండా రాజీ చేయటం వలన అధికారుల మనోధైర్యం దెబ్బతింటుందన్నారు. ప్రజాసేవ చేస్తున్న అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement