టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌లో ఆంక్షలు | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌లో ఆంక్షలు

Published Mon, Jul 24 2017 10:33 PM

Restrictions in the counseling of teacher transfers

  •  ఒక్కరిని మాత్రమే అనుమతిస్తున్న అధికారులు
  • నేడు ఇంగ్లీష్, గణితం, పీడీలకు కౌన్సెలింగ్‌
  • అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌లో సోమవారం కొత్త ఆంక్షలను అమలు చేశారు. అంతకు ముందు రోజులు కౌన్సెలింగ్‌ హాలులోకి ఒకేసారి 50 మందిని అనుమతించి అందరి సమక్షంలో సీనియార్టీ జాబితా ప్రకారం ఒక్కొక్కరిని పిలిచి స్థానాలు కోరుకోమని చెప్పేవారు. అయితే సోమవారం జరిగిన తెలుగు, హిందీ, ఉర్దూ టీచర్ల కౌన్సెలింగ్‌లో కేవలం సీనియార్టీ జాబితా ప్రకారం ఒక్కరిని మాత్రమే హాలులోకి పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తక్కిన వారందరినీ మరో హాలులో కూర్చొబెట్టారు. జిల్లా పరిశీలకులు, ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ జరిగింది.

    మార్పులు, చేర్పులుండవు

    ఈ సందర్భంగా ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిని కలిసిన పలువురు టీచర్లు తుదిజాబితాలో చాలా తప్పులున్నాయంటూ ఫిర్యాదులు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాత్కాలిక జాబితాలో ఏవైనా తప్పొప్పులుంటే సవరణలు చేస్తామన్నారు. అంతేకాని తుది జాబితా వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదని స్పష్టం చేశారు. అలాగే 40 శాతం వికలత్వంతో ప్రిపరెన్షియల్‌ కేటగిరీలో ఉన్న టీచర్లందరూ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసేలోగా మెడికల్‌ బోర్డు నుంచి ధ్రువీకరణత్రం తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. లేదంటే చర్యలుంటాయని హెచ్చరించారు.

    నేడు ఇంగ్లిష్, గణితం, పీడీలకు కౌన్సెలింగ్‌

    ఇంగ్లిష్, గణితం స్కూల్‌ అసిస్టెంట్లతో పాటు పీడీలకు మంగళవారం కౌన్సెలింగ్‌ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంగ్లిష్, గణితం టీచర్లు ఉదయం 10 గంటలకు సైన్స్‌సెంటర్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అలాగే పీడీలు, అడహక్‌ పీడీలకు మధ్యాహ్నం కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా కౌన్సెలింగ్‌ హాలులోకి ఉపాధ్యాయ సంఘాల నాయకులను అనుమతించాలని పలువురు నాయకులు ఆర్జేడీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్జేడీ స్పందిస్తూ కేవలం కౌన్సెలింగ్‌ హాజరయ్యే టీచర్లు మినహా తక్కిన ఎవరికీ అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

    నేడు రెండు కేంద్రాలు

    గణితం, ఇంగ్లీష్‌ టీచర్లు అధికసంఖ్యలో ఉండటంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సైన్స్‌ సెంటర్‌లోనే రెండు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకచోట ఇంగ్లిష్, మరోచోట గణితం టీచర్లకు కౌన్సెలింగ్‌ ఉంటుంది.

Advertisement
Advertisement