పొలాల్లో దోశ, సాంబార్‌ సాగు అట..

28 Dec, 2016 03:40 IST|Sakshi
పొలాల్లో దోశ, సాంబార్‌ సాగు అట..

ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు
అందకుండా పోయిన ఇన్‌పుట్‌ సబ్సిడీ
ఆందోళనలో రైతులు

మద్నూర్‌: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది రెవెన్యూ అధికారుల తీరు.. ‘రైతులు తమ పంట పొలాల్లో దోశ, సాంబార్, హోటల్‌ పువ్వులు పండించారు. మంచి దిగుబడులు సాధించి లాభాల్లో ఉన్నారు’ అంటూ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కారణంగా రైతులకు కరువు సాయం అందకుండా పోయిన వైనమిది.  కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని పెద్ద శక్కర్గా, సుల్తాన్‌పేట్‌ గ్రామాలకు చెందిన రైతులు గతేడాది ఖరీఫ్‌లో సోయాబీన్, పెసర తదితర పంటలు పండించారు. కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాన్ని అంచనా వేసిన అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక పంపించారు.

అందులో ఎక్కడా లేని విధంగా రైతులు సాంబార్, దోశ, హోటల్‌ పువ్వులు వంటి పంటలు పండించారని, మంచి లాభాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దీంతో వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ అందకుండా పోయింది.  మద్నూర్‌ మండలంలోని పెద్ద శక్కర్గాకు చెందిన రైతు హన్మంత్‌రావ్, పీరాబాయి, రుక్మిణీబాయి, దేవిదాస్, నాగ్‌నాథ్, అర్జున్‌ పటేల్, అహ్మద్‌ఖాన్‌లు దోçశ, సాంబార్, హోటల్‌ పువ్వులు వేశారని నమోదు చేశారు. సుల్తాన్‌పేట్‌కు చెందిన ధన్‌రాజ్‌గౌడ్‌ నాలుగు ఎకరాలలో సోయా వేయగా.. చిక్కుడుకాయ పండించారని, మౌలానా రెండు ఎకరాలలో హోటల్‌ పువ్వులు పండించారని పేర్కొన్నారు.

అధికారుల నివేదిక మేరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు కాని రైతులు మంగళవారం తహ సీల్‌ కార్యాలయానికి వచ్చి అధికారులను నిలదీశారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. కొందరు రైతులు సాంబార్, దోశ పండించినట్లు జాబితాలో వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదని, దీనిపై విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు