నాణేల ప్రేమికులకు ‘ఒలింపిక్స్‌’ ఉత్సాహం | Sakshi
Sakshi News home page

నాణేల ప్రేమికులకు ‘ఒలింపిక్స్‌’ ఉత్సాహం

Published Sat, Aug 20 2016 11:39 PM

నాణేల ప్రేమికులకు ‘ఒలింపిక్స్‌’ ఉత్సాహం

ఒలింపిక్‌ పోటీలు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులకే కాదు.. నాణేల ప్రేమికులకు కూడా కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. ఈ ప్రపంచ క్రీడా సంబరాన్ని పురస్కరించుకుని వివిధ దేశాలు సరికొత్త నాణేలు విడుదల చేశాయి. వీటిల్లో ఆస్ట్రేలియా విడుదల చేసిన నాణేలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన ప్రముఖ నాణేల సేకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్‌ ప్రత్యేక ఆర్డర్‌పై అయిదు ఒలింపిక్స్‌ నాణేలను సేకరించారు. వీటి గురించి ఆయన ఇలా వివరించారు. ‘ఒలింపిక్స్‌ చిహ్నాన్ని 1912లో రూపొందించారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య 1914 జూన్‌లో దీనిని స్వీకరించి 1920 నుంచి వినియోగిస్తోంది. ఒకదానితో ఒకటి గొలుసులా కలిసిన అయిదు రింగులు ఒలింపిక్‌ క్రీడల చిహ్నం. నీలం, పసుపుపచ్చ, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉండే ఈ అయిదు రింగులు వరుసగా యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలను సూచిస్తాయి. ఇవి క్రీడా స్ఫూర్తికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ చిహ్నాన్ని శాంతికి ప్రతీకగా నిలిచే తెల్లని వస్త్రంపై ముద్రిస్తారు. రియో ఒలింపిక్స్‌ సందర్భంగా ఆస్ట్రేలియా రెండు డాలర్ల ముఖ విలువ ఉన్న అయిదు నాణేలను ముద్రించింది. ఒక్కో నాణెంపై ఒలింపిక్‌ చిహ్నంలోని ఒక్కో రంగును ముద్రించింది. అలాగే ఈ అయిదు నాణేలపై ఆస్ట్రేలియా క్రీడాకారులు పాల్గొనే పలు క్రీడాంశాలను కూడా ముద్రించారు’ అని కామేశ్వర్‌ తెలిపారు.                
 – అమలాపురం టౌన్‌

Advertisement
Advertisement