రొట్టెల పండగకు విస్తృత ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

రొట్టెల పండగకు విస్తృత ఏర్పాట్లు

Published Mon, Oct 10 2016 1:19 AM

రొట్టెల పండగకు విస్తృత ఏర్పాట్లు - Sakshi

 
   మంత్రి నారాయణ
నెల్లూరు(బృందావనం):రొట్టెల పండగకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ తెలిపారు.  పండగ ఏర్పాట్లను ఆదివారం రాత్రి మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 20వ తేదీన రూ.6కోట్లతో ఘాట్లు, సేదతీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆదివారం మరో› రూ.5కోట్లు మంజూరు చేశారని తెలిపారు. భవిష్యత్తులో బారాషహీద్‌దర్గాను ఉన్నతమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామన్నారు. 
ఆక్రమణలను ప్రణాళికాబద్ధంగా తొలగిస్తాం
నగరంలోని ఆక్రమణలను ప్రణాళికాబద్ధంగా తొలగిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నిర్వాసితులకు కొత్తూరులో గృహ వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. రానున్న మరో రెండు నెలల్లో కురిసే వర్షాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సూచనలు, సలహాల మేరకు ఆక్రమణల తొలగింపు జరుగుతుందన్నారు. తాను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు తనపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. టీడీపీ నెల్లూరురూరల్‌ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రొట్టెల పండగ నిర్వహణకు సంబంధించిన  ఫెస్టివల్‌ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్‌ జంషీద్, పఠాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో మేయర్‌ అబ్దుర్‌ అబ్దుల్‌అజీజ్, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కిలారి తిరుపతినాయుడు పాల్గొన్నారు.

Advertisement
Advertisement