మహిళా సంఘాల నిధులు స్వాహా | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాల నిధులు స్వాహా

Published Sun, Apr 2 2017 3:24 PM

మహిళా సంఘాల నిధులు స్వాహా

► రూ.6.73 లక్షలు కైంకర్యం
► పరారీలో వెలుగు సీసీ


మార్కాపురం: రెండు మహిళా సంఘాల ఖాతాల్లో ఉన్న సుమారు రూ.6.73 లక్షల నిధులను వెలుగు కమ్యూనిటీ కో ఆర్డినేటర్‌ (సీసీ) స్వాహా చేశాడు. రాజుపాలెంలో ఆదర్శ మహిళా సంఘంలో 10 గ్రూపులు ఉన్నాయి. వాటిల్లో ఆదర్శ, ఆరాధన, భారతి, భగత్, క్రీస్తు, మేరీమాత, ప్రభు, శాంతి, విజయ గ్రూపులున్నాయి. వెలుగు సీసీగా పనిచేస్తున్న వ్యక్తి మహిళల వద్దకు వెళ్లి రుణాలు చెల్లించాలంటూ ఒక్కో గ్రూపు నుంచి రూ.12 వేలు చొప్పున డ్రా చేయించి ఆ డబ్బును తన సొంత ఖర్చులకు వాడుకున్నాడు. మళ్లీ ఆరు గ్రూపుల నుంచి రికార్డు మెయింటెనెన్స్, బ్యాంకు ఖాతాల్లో ఖర్చుల కోసం అంటూ రూ.7,200 చొప్పున వసూలు చేశాడు. ఈ విధంగా రూ.1.63 లక్షలు వసూలు చేశాడు. ఇదే సీసీ వేములకోట పంచాయతీలోని కొట్టాలపల్లెలో ఉన్న భవానీ, విజయ గ్రూపుల నుంచి రూ.5.10 లక్షలు వారి ద్వారానే బ్యాంకుల నుంచి డ్రా చేయించి స్వాహా చేశాడు.

 ప్రభుత్వం స్వయం సహాయక బృందాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు బ్యాంకుల్లో చేస్తున్న పొదుపు ఆధారంగా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ ప్రక్రియలో వెలుగు అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. వీరిచ్చే నివేదికల ప్రకారమే బ్యాంకు మేనేజర్లు పొదుపు గ్రూపులకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే బ్యాంకర్లు రెట్టింపు రుణాలు ఇస్తారు. వీటి ద్వారా మహిళలు పాడిపరిశ్రమ, దుస్తుల వ్యాపారం నిర్వహించుకోవచ్చు. మహిళల అవసరాన్ని ఆసరా చేసుకున్న వెలుగు సీసీ నమ్మకంతో వారి ద్వారానే బ్యాంకు ఖాతాల నుంచి నగదు డ్రా చేయించుకుని స్వాహా చేశాడు. ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు లబోదిబోమంటూ సదరు సీసీ నిర్వాహకంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు బ్యాంకు మేనేజర్లు మాత్రం రుణాలు చెల్లించాల్సిందేనంటూ గ్రూపు లీడర్లపై ఒత్తిడి తేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: మార్కాపురం మండలం రాజుపాలెం, కొట్టాలపల్లె గ్రామాల్లో వెలుగు సీసీ డబ్బులు దుర్వినియోగం చేసినట్లు అక్కడి మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మా శాఖ ఉన్నతాధికారులు సదరు సీసీపై పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాం. ---రమేష్, ఏపీఎం, వెలుగు

Advertisement

తప్పక చదవండి

Advertisement