ఆర్టీఏ అధికారుల నిర్వాకం | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ అధికారుల నిర్వాకం

Published Tue, Jul 26 2016 6:43 PM

ఆర్టీఏ అధికారుల నిర్వాకం - Sakshi

 

  తనిఖీల పేరుతో ఆటోను వెంబడించిన కానిస్టేబుల్‌
♦  వేగం పెంచిన డ్రైవర్‌.. వాహనం బోల్తా
♦  ప్రయాణికులకు తీవ్ర గాయాలు

వికారాబాద్‌ రూరల్‌: ఆర్టీఏ అధికారుల నిర్వాకంతో ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. క్షతగాత్రుల కథనం ప్రకారం.. వికారాబాద్‌ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా నుంచి మన్నెగూడ వెళ్లే ఆటోలో డ్రైవర్‌ అబ్దుల్‌ కరీం ప్రయాణికులను ఎక్కించుకుని బయలు దేరారు. శివారెడ్డిపేటకు చెందిన బాలుడు శివ(16), మన్నెగూడకు చెందిన లక్ష్మి, ఈశ్వరమ్మ, మల్లమ్మ ఆటోలో ఎక్కారు. రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత మారుతీనగర్‌ గేటు సమీపంలో ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బ్రిడ్జి దిగుతూనే  ఆర్టీఏ తనిఖీలను గమనించిన ఆటో డ్రైవర్‌ కరీం వాహనం వేగం పెంచాడు. ఈక్రమంలో మారుతీనగర్‌ గేటువైపు ఆటోను తిప్పాడు. ఆర్టీఏకు చెందిన కానిస్టేబుల్‌ ఆటో డ్రైవర్‌ను చెయ్యి పట్టి బయటకు లాగాడు. దీంతో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బాలుడు శివ రెండు కాళ్లు విరిగి పోయాయి. ఆటోలో ఉన్న మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్‌ అబ్దుల్‌ రహీంకు చేతికి గాయమైంది.

ఉడాయించిన ఆర్టీఏ అధికారులు
 ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన ఆర్టీఏ అధికారులు వెంటనే అక్కడి నుంచి ఉడాయించారు. ప్రయాణికులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శివను హైదరాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ప్రమాదానికి కారణమైన ఆర్టీఏ అధికారులుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement