పల్లెల్లో తెలుగు వెలుగులేవీ? | Sakshi
Sakshi News home page

పల్లెల్లో తెలుగు వెలుగులేవీ?

Published Wed, Aug 10 2016 12:52 AM

పల్లెల్లో తెలుగు వెలుగులేవీ? - Sakshi

 
  •  126 గ్రామాలకు తెలుగు వెలుగులు దూరం
  •  శ్లాక్‌ సీజన్‌ పేరుతో 21 సర్వీసుల రద్దు
  • – ప్రయాణికుల ఇక్కట్లు
‘ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి సురక్షితంగా గమ్యం చేరండి.. ప్రైవేటు వాహనాలు ఆశ్రయించకండి.. ప్రమాదాల బారిన పడకండి’ అని అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రూట్‌లో ఆదాయం వస్తేనే బస్సును తిప్పండి లేదంటే నిలిపివేయండంటూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో కొన్ని పల్లెల్లో తెలుగు వెలుగు బస్సులు కనిపించడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
నెల్లూరు(టౌన్‌):
 జిల్లాలో 126 గ్రామాలకు నేటికి ఆర్టీసీ బస్సులు నడవడం లేదంటే కొంత ఆశ్చర్యంగా ఉన్నా నమ్మక తప్పదు. తాజాగా శ్లాక్‌ సీజన్‌ పేరుతో నష్టాలు వస్తున్నాయంటూ ప్రధాన రహదారుల్లో తిరుగుతున్న 21 సర్వీసులను నిలిపివేశారు. వీటిపై ఆర్టీసీ సంఘాలు ఆందోళన బాట పట్టాయి.
నాలుగు రోజుల క్రితం నుంచి 21 సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో సర్వీసులు నిలిపివేయడంపై ఆర్టీసీ సంఘాలు మండిపడుతున్నాయి. నెల్లూరు డిపో–1 నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడకు తిరుగుతున్న మూడు బస్సులను నిలిపివేశారు. డిపో–2 నుంచి చెన్నై నుంచి విజయవాడ తిరుగుతున్న బస్సును రద్దు చేశారు. అదేవిధంగా రాపూరు డిపో నుంచి –1, ఆత్మకూరు డిపో నుంచి–3 కావలి నుంచి–4, ఉదయగిరి నుంచి –4, వాకాడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి డిపోల నుంచి ఒక్కో బస్సును రద్దు చేశారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, తిరుపతికి తిరుగుతున్న బస్సులను రద్దు చేశారు. సర్వీసుల రద్దు చేయడానికి ప్రైవేటు వాహనాల యజమానుల నుంచి అందుతున్న ముడుపులే కారణమని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
బస్సులు తిరగని గ్రామాలు...
నష్టాలు వస్తున్నాయని, రోడ్డు బాగాలేదని చెబుతూ ఇప్పటికి జిల్లాలో 126 గ్రామాల్లో ఆర్టీసీ బస్సులను తిప్పడం లేదు. అనంతసాగరం రూట్‌లో చీపురపల్లి, చాకురాళ్లపల్లి, కావలి మండలంలో కోనేటిపాలెం, గానుగపెంట, దగదర్తి రూట్‌లో మట్టెంపాడు, సంగం రూట్‌లో నీలాయపాలెం, తిమ్మాపురం, చింతూరు, ఆనపల్లిపాడు, వెంగమాంబపురం, దేవరవేమూరు, అత్తలసిద్దవరం, కోనేశ్వరపాడు, ఎల్లవగ్గపలి, తిమ్మినగుంట, లింగంపాలెం, బొట్ల, కొత్తనల్లపాడు, పెనుబర్తిగోపవరం, శుద్ధమల్లి, కోటూరుపాడు, చందనమూడి, మనిమాలముడి, సూరపుఅగ్రహారం, బురదమడుగు, యల్లాయపాలెం, వేటగిరిపాలెం గ్రామాలకు బస్సులు తిరగడం లేదు. సూళ్లూరుపేట మండలంలో చెరువుమిట్ట, కొమ్మినేనిపల్లి, పంట్రంగం, సర్వారెడ్డికొండ, ఎర్రబల్లి, వాకాడు మండలంలో పాటెటిపాలెం, జువ్వినట్టు, రెడ్డిపాలెం, పంబలి, పుదిరాయదరువు, ఉదయగిరి నుంచి కిష్టంపల్లి మీదుగా అర్లపడిగ, బిజ్జంపల్లి, అప్పసముద్రం, గూడూరు నుంచి చెర్లోపల్లి, కుడితపల్లి, కాగితాలపూర్, లక్ష్మీనరసాపురం, కొడవలూరు మండలం యల్లాయపాలెం, రామన్నపాలెం, మానేగుంటపాడు, రెడ్డిపాలెం, ఆలూరు తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ ప్రాంత ప్రజలు ప్రైవేట వాహనాలను ఆశ్రయిస్తున్నారు. 
కావాలనే సర్వీసులను రద్దు చేశారు : – రమణరాజు, ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అధికారులు కావాలనే సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం శ్రావణమాసం సందర్భంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు పుష్కరాలు కూడా జరగనున్నాయి. శ్లాక్‌ సీజన్‌ పేరుతో బస్సులను రద్దు చేయడం తగదు. వెంటనే వాటిని పునరుద్ధరించాలి.
 
ఆదరణ ఉంటే తప్పకుండా తిప్పుతాం : రవివర్మ, ఆర్టీసీ ఆర్‌ఎం
రూట్లల్లో ఆదరణ, ఆదాయం వస్తే తప్పకుండా బస్సులను తిప్పుతాం. నష్టాలు వస్తే బస్సులను తిప్పలేం. శ్లాక్‌ సీజన్‌ కారణంగా ప్రయాణికులు తక్కువగా ఉండటంతోనే ఆ సర్వీసులను నిలిపివేశాం. రద్దీ రోజుల్లో అదనంగా 48 సర్వీసులను తిప్పాం. 

Advertisement
Advertisement