Sakshi News home page

టీడీపీ స్పెష‘లిస్టు’

Published Fri, Feb 26 2016 12:53 AM

టీడీపీ స్పెష‘లిస్టు’ - Sakshi

 వైద్యాధికారి పోస్టుల భర్తీకి ఒత్తిళ్లు
 తాము చెప్పినవారినే ఓకే
 చేయాలని అధికార పార్టీ నేత ఆదేశాలు
 వికలాంగుల పోస్టింగ్‌లకూ పైరవీ
 కలెక్టరేటులో మకాం వేసిన
 ‘అధికార’ అనుచరులు
  జాబితా విడుదలలో జాప్యం

 
 శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు కమ్యూనిటీ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకానికి మెరిట్ జాబితాలను మార్చేందుకు అధికార పార్టీ పెద్దల వద్ద పని చేస్తున్న ఓ వ్యక్తి రంగ ప్రవేశం చేశారు. తామిచ్చిన జాబితాలలోని వ్యక్తులకే పోిస్టింగ్‌లు ఇవ్వాలంటూ ఉన్నతాధికార్లపై ఒత్తిళ్లు పెంచిన సదరు అధికారి ఏకంగా గురువారం కలెక్టరేటులో మకాం వేశారు. ఏకకాలంలో వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు వైద్యాధికార్ల నియామకానికి సంబంధించి కసరత్తు జరుగుతున్న కీలక సమయంలో అధికార పార్టీ కీలక నేత కార్యాలయ ప్రతినిధి ఇలా మకాం వేయడం మెరిట్ అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. జిల్లాలోని ప్రాథమిక
 
  ఆరోగ్యకేంద్రాలతోపాటు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో 47 వైద్యాధికార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 30 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 269మంది డాక్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. రోస్టర్ విధానంలో మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాల్సిఉంది. అయితే దరఖాస్తుదారుల్లో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న వారు కూడా ఉన్నారు. అక్కడ మెరిట్ మార్కులతో సర్టిఫికెట్లను పొందిన వైద్యులు ఈ పోస్టింగ్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైద్యవిద్య పూర్తి చేసుకున్న వారితోపాటు విదేశాల్లో చదివిన వారికి వచ్చే మార్కులతో సమానంగా పరిగణలోకి తీసుకుంటే మార్కుల్లో వ్యత్యాసం తప్పదని రాష్ట్రంలో చదువుకున్న వారు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మెరిట్లను పక్కన పెట్టి తామిచ్చిన జాబితాలకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికార పక్షం నేతల అనుచరగణం ఒత్తిడి పెంచారు. దీంతో జాబితా విడుదలలో జాప్యం కొనసాగుతోంది.
 
 వికలాంగులు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో తలెత్తిన సమస్యల వల్ల నియామకాలు ఇవ్వడానికి కొంత ఆలస్యమైంది. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్నతాధికార్లనుంచి వచ్చిన ఆదేశానుసారం  వికలాంగుల అభ్యర్థుల జాబితా ఖరారైంది. అభ్యర్థుల ఎంపిక కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి జాబితాలను సిద్ధం చేసింది. పోస్టింగ్‌లకు గురువారం అభ్యర్థులను సిద్ధం చేసిన తరుణంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నియామకాలు జరపాలంటూ మోకాలు అడ్డం పెట్టారు. ఇందులోనూ అన్యాయం జరగడానికి వీల్లేదంటూ ఉన్నతాధికార్లు తెగేసి చెప్పడంతో కొంత వెనక్కితగ్గారని తెలుస్తోంది. దీంతో అధికారులు 35మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ పోస్టింగ్‌లను సిద్దం చేశారు.  ఏది ఏమైనా అధికార పార్టీ నేతల అనుచరుల మంటూ వారి కార్యాలయ అధికారులు పాలనా అంశాల్లో జోక్యం చేసుకోవడం ఉన్నతాధికార్లకు మింగుడు పడడం లేదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement