'ఫైన్' స్టేషన్ | Sakshi
Sakshi News home page

'ఫైన్' స్టేషన్

Published Fri, Jun 24 2016 11:59 PM

'ఫైన్' స్టేషన్ - Sakshi

* నందనవనంలా ఎస్.కోట ఫైర్ స్టేషన్
* సకల సౌకర్యాల కల్పన
* అందరి సహకారంతో అభివృద్ధి

శృంగవరపుకోట: ఆహ్లాదకర వాతావరణం.. ఆప్యాయంగా మాట్లాడే సిబ్బంది.. అగ్ని ప్రమాదాలపై ప్రజలను అవగాహన కల్పించేందుకు సదస్సులు.. ఇలా శృంగవరపుకోట ఫైర్‌స్టేషన్ జిల్లాలో ‘ఫైన్ స్టేషన్’గా అభివృద్ధి చెందింది. ఐదేళ్ల క్రితం ఈ అగ్ని మాపక శాఖ కార్యాలయం అధ్వానంగా ఉండేది. బూత్‌బంగ్లా మాదిరిగా మందుబాబులకు, పేకాటరాయుళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందింది.

పైకప్పు సిమెంట్ రేకులు పగిలిపోయి వర్షం వస్తే కారిపోయేది. ఆవరణమంతా పిచ్చిమొక్కలతో ఉండేది. అటువంటి ఈ ఫైర్ స్టేషన్‌కు ఎఫ్‌వోగా 2011 ఆగస్టులో రామచంద్ర వచ్చారు. ఆయన స్టేషన్ అభివృద్ధిపై దృష్టి సారించారు. ముందుగా ప్రభుత్వ నిధులు రూ.5లక్షలతో ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత రెస్ట్ రూము, కార్యాలయ గదులకు మరమ్మతులు చేశారు. మరుగుదొడ్లు, ట్యాంక్ నిర్మించారు. స్టేషన్ ఆవరణలోని పిచ్చిచెట్లు తొలగించి పూలమొక్కలు నాటించారు. సిబ్బంది కోసం షటిల్ కోర్టు, తాగునీటి కుళాయిలు, గ్యాస్ స్టౌ, వాటర్ ఫిల్టర్, టీవీ వంటివి ఏర్పాటు చేశారు. స్టేషన్‌ను నందనవనంలా తీర్చిదిద్దారు.
 
అవగాహన కార్యక్రమాల నిర్వహణ
అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఫైర్‌స్టేషన్ సిబ్బంది ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, కార్మికులతో పలు సదస్సులు నిర్వహించి అందరి అభినందనలు పొందారు. ఇటీవల ఎస్.కోట వచ్చిన డీఎఫ్‌వో స్వామి కూడా ఫైర్‌స్టేషన్ నిర్వహణ తీరుపై ఆనందం వ్యక్తంచేశారు. నాటి విశాఖ ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే లలితకుమారి, రఘురాజు, మళ్ల గణేష్, స్థానిక వర్తక సంఘం, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం, స్టోన్ క్రషర్స్ అసోషియేషన్, మీడియా మిత్రుల సహకారంతో అభివృద్ధి సాధ్యమైందని ఎఫ్‌వో రామచంద్ర తెలిపారు.

Advertisement
Advertisement