విషాదం మిగిల్చిన విహారం | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన విహారం

Published Mon, Sep 19 2016 12:36 AM

sad in tour

ఆ ఇద్దరు విద్యార్థులు వరుసకు అన్నాచెల్లెళ్లు.. తాము చదువుతున్నది హైదరాబాద్‌ నగరంలో.. బక్రీద్‌ పండగ కోసం ఐదు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి ఎంతో సంతోషంగా గడిపారు.. మరుసటిరోజు తిరిగి పాఠశాలకు వెళ్లాలనుకున్నారు.. అంతలోనే రిజర్వాయర్‌ను చూసొద్దామని బంధువుల పిల్లలు, తల్లితో కలిసి వెళ్లారు.. ప్రమాదవశాత్తు అందులో పడి ఇద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.     
    – నాగర్‌కర్నూల్‌ రూరల్‌  
నాగర్‌కర్నూల్‌ పట్టణానికి చెందిన ఆసియా, తమ కూతురు ఫారియా (9), మరిది పిల్లలు షానవాజ్‌ (18), నాజియా, ఆశా, మునీర్‌; బంధువుల పిల్లలు ముజఫర్, రెహాన్, రిజ్వానాలను తీసుకుని ఆదివారం మధ్యాహ్నం గుడిపల్లి రిజర్వాయర్‌ను చూసేందుకు వెళ్లారు. అనంతరం అక్కడే సీతాఫల కాయలు కనిపించడంతో పిల్లలు వాటిని తెంపుకొన్నారు. చేతులకు మురికి అంటడంతో కడుక్కునేందుకు రిజర్వాయర్‌లోకి దిగారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా జారి మునీర్, ముజఫర్, ఫారియా, షానవాజ్‌లు అందులో పడిపోయారు. ఇది గమనించిన ఆసియా వెంటనే మునీర్, ముజరఫర్‌లను బయటకు లాగింది. అప్పటికే ఫారియా, షానవాజ్‌ నీటమునిగి చనిపోవడంతో తల్లి కేకలు వేసింది. దీంతో గౌడ్‌దేవునిపల్లికి చెందిన కొప్పమోని సురేష్‌తోపాటు గజ ఈతగాళ్లు రిజర్వాయర్‌లోకి దిగి పిల్లల మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. కాగా, ౖహె దరాబాద్‌ నగరంలో చదువుతున్న షానవాజ్, ఫారియా బక్రీద్‌ పండగ ఉండటంతో ఐదురోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే బంధువుల పిల్లలు సరదాగా గుడిపల్లి రిజర్వాయర్‌ చూద్దామని ఆసియాతో చెప్పటంతో అక్కడికి తీసుకెళ్లగా ఈ సంఘటన చోటు చేసుకోవడం గ్రామస్తులను కలచివేసింది.
 

Advertisement
Advertisement