అస్తవ్యస్తంగా సాగర్‌కాలనీలు | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తంగా సాగర్‌కాలనీలు

Published Sun, Oct 9 2016 7:51 PM

అస్తవ్యస్తంగా సాగర్‌కాలనీలు - Sakshi

నాగార్జునసాగర్‌ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సాగర్‌లోని వివిధ కాలనీల్లో గల వీధులన్నీ బురదమయంగా మారాయి. డ్రెయినేజీ నిర్మాణాల పేరుతో ఇటీవల రోడ్లన్నీ తవ్వారు. మరలా వాటిని సరిగ్గా నిర్మించకపోవడంతో గుంతలమయంగా తయారయ్యాయి. వీటిపై వాహనాలు తిరుగుతుండడంతో మరీ అధ్వానంగా మారాయి. ఫలితంగా చిన్నపాటి వర్షమెుచ్చినా చిత్తడిగా తయారై వాహనాలు, పాదచారుల రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇదేకాక గుంతల్లో వర్షం నీరు రోజుల తరబడి నిలిచి ఉండడంతో  కంపు వాసన వస్తోందని వివిధ కాలనీవాసుల వాపోతున్నారు. ముఖ్యంగా పైలాన్‌కాలనీలోని మత్స్యకారులు నివాసముండే వీదంతా వర్షాలకు చేపలమడుగులా మారింది. ఎప్పుడో పోసిన కంకరంతా ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోగా రోడ్డంతా గుంతలే దర్శనమిస్తోంది. 
నీరుగారుతున్న ప్రభుత్వ క్వార్టర్లు
సాగర్‌లోని పైలాన్‌ కాలనీలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ క్వార్టర్లన్నీ శిథిలావస్థకు చే రుకున్నాయి. భవనాల పైకప్పు పెచ్చులూడుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు గదుల్లోకి నీరు కారుతుండడంతో ఇళ్లలో ఉండలేని పరిస్థతి దాపురించిందని అందుల్లో నివాసముండే వారు పేర్కొంటున్నారు. దీంతో సమానులన్నీ ఒకదగ్గరకు చేరి వేరే ప్రాంతాల్లో నివాసముంటున్నామని పలువురు తెలిపారు. మరమ్మతులు చేసుకున్న వారి క్వార్టర్లు కొంతమేర బాగున్నప్పటికీ మరమ్మతులు చేయని క్వార్టర్లు కొన్ని కూలిపోగా మరికొన్ని నీరు కారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టు అధికారులు ఆయా కాలనీలను పర్యవేక్షించి సీసీ రోడ్లు వేయించాలని స్థానికులు కోరుతున్నారు. 
సీసీ రోడ్డు వేయాలి– కోదండం, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు 
 మత్స్యకారులు నివాసమంటున్న ఈవీధిలో రోడ్డంతా వర్షాలకు కొట్టుకుపోయింది. ఇళ్లముందు బురద గుంటలు ఏర్పడి మడుగుల్లా దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు అధికారులు స్పందించి సీసీ రోడ్లు వేయించాలి. లేదంటే జనం రోగాలబారిన పడతారు.  
 

Advertisement
Advertisement