తాగునీటికే సాగర్‌ జలాలు | Sakshi
Sakshi News home page

తాగునీటికే సాగర్‌ జలాలు

Published Thu, Aug 4 2016 11:19 PM

water

త్రిపురాంతకం: 
-ఎస్‌ఎస్‌ ట్యాంకులు, చెరువులు నింపేందుకు కసరత్తు 
- నీరు వృథా కాకుండా పర్యవేక్షణ
-  రైతులు సహకరించాలంటున్న అధికారులు 
సాగర్‌ ప్రధానకాలువ ద్వారా 1850 క్యూసెక్కుల నీరు జిల్లాకు చేరింది. జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు సాగర్‌ జలాలను విడుదల చేశారు. రెవెన్యూ, సాగర్, పోలీస్‌ అధికారులు నీటిని తాగునీటి చెరువులు నింపేందుకు కాలువలపై నిరంతరం మానిటరింగ్‌  చేస్తున్నారు. త్రిపురాంతకం ఎన్‌ఎస్‌పీ ప్రధానకాలువ ద్వారా జిల్లాకు 3.5 టీఎంసీల నీరు అందనుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు 85–3వ మైలు వద్ద  2200ల క్యూసెక్కుల నీటిని అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్‌ఎస్‌ ట్యాంకులతో పాటు తాగునీటి చెరువులు నింపనున్నారు. ఈ మేరకు ఆర్‌డబ్ల్యూఎస్‌ పరిధిలోని ఎస్‌ఎస్‌ ట్యాంకులు నింపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19వరకు నీటిని అందించనున్నారు.   
ప్రధానకాలువపై పర్యటన
సాగర్‌ ప్రధానకాలువపై యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యేకాధికారి కొండయ్య, ఎన్‌ఎస్‌పీ డీఈఈ నరిసింహారెడ్డి, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మాణిక్యరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ త్యాగరాజులు సాగర్‌కాలువలపై పర్యటించి నీటి సరఫరా పరిశీలించారు. ఇదే విదంగా నీటి సరఫరా జరిగితే మరో మూడు, నాలుగు రోజుల్లో రామతీర్థం జలాశయంకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
తాగునీటికి మాత్రమే ..
– చంద్రశేఖర్, ఆర్డీఓ 
సాగర్‌ జలాలను వృథా చేయకుండా తాగునీటికి మాత్రమే ఉపయోగించుకునే చర్యలు తీసుకోవాలి. ముటుకుల, గొల్లపల్లి, దూపాడు, మార్కాపురం మున్సిపాలిటీ ఎస్‌ఎస్‌ ట్యాంకులను నింపేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి.  తాగునీటి చెరువులు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  
 
రైతులు సహకరించాలి
 –  నరిసింహారెడ్డి, ఎన్‌ఎస్‌పీ డీఈఈ 
సాగర్‌ జలాలు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే విడుదల చేసిన విషయాన్ని రైతాంగం గుర్తించి సహకరించాలి. ఎస్‌ఎస్‌ ట్యాంకులు, చెరువులు నింపుతారు. రైతులు భూములు తడుపుకునేందుకు నీటిని వినియోగించే ప్రయత్నం చేయరాదు. రైతులు అధికారులకు సహకరించాలి.
 
 

 

Advertisement
Advertisement