సాహితీ విహారి | Sakshi
Sakshi News home page

సాహితీ విహారి

Published Tue, Oct 25 2016 5:40 PM

సాహితీ విహారి

విహారి.. తెలుగు సాహితీ రంగంలో సుప్రసిద్ధమైన కలం. ఆయన కేవలం  కథా విహారి మాత్రమే కాదు.  పన్నెండు కథా సంకలనాలతో ‘తెలుగు కథ తేజోరేఖలు’, ‘కథా విహారం’,  ‘పరిచయాలు పరామర్శలు’ శీర్షికలతో విమర్శకుడి గానూ ప్రసిద్ధులు. 75 ఏళ్ల వయసు లోనూ కథారచనను యజ్ఞంలా చేస్తున్నారు. ఆయన సాహితీ షష్టిపూర్తి ఇటీవల విజయవాడలో  జరిగింది. ఈ సందర్భంగా ఫోన్‌లో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. 
– తెనాలి
 
మాది తెనాలి. తల్లిదండ్రులు శ్రీదేవి, జొన్నలగడ్డ మేదాదక్షిణామూర్తి. 1941 అక్టోబరు 15న జన్మించాను. నా అసలు పేరు సత్యనారాయణమూర్తి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నా చదువు ఎస్‌ఎస్‌ఎల్‌సీతోనే ఆగిపోయింది. చిన్ననాటే పేదరికంలోని కష్టాలను అనుభవించాను. చిరుద్యోగంతో ఆరంభించి, ప్రైవేట్‌గా చదువుకుంటూ డిగ్రీలు, రచయితగా గుర్తింపునూ సాధించుకోగలిగాను. మా నాన్నగారికి భర్మాషెల్‌ అనే ప్రముఖ కంపెనీలో ఉద్యోగం. ముక్కుసూటి మనిషి. ఒకానొక సందర్భంలో ఉద్యోగం వదిలేశారు. మా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మేం ఏడుగురం. ఇద్దరం మగబిడ్డలం. ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు.  
 
పుస్తకాలంటే పిచ్చి..
చిన్నవయసులో మచిలీపట్నంలో పనిచేసినపుడు అక్కడి సాహిత్య వాతావరణం నాకు ప్రేరణ . అప్పట్లో పుస్తకాలు పిచ్చిగా చదివేవాణ్ణి. తెనాలికి చెందిన త్రిపురనేని గోపీచంద్‌ కథల ప్రభావం ఎక్కువ. మధురాంతకం రాజారాం కథలూ నాకు ఆసక్తి. చుక్కాని అనే పత్రికలో ‘రాగజ్యోతి’ పేరుతో నా తొలికథ ప్రచురితమైంది. అది 1962వ సంవత్సరం. అప్పటికి జీవిత బీమా సంస్థలో చిన్న ఉద్యోగంలో ఉన్నాను. శాలివాహన అనే నా సహ ఉద్యోగితో కలిసి దాదాపు పదిహేనేళ్లు చాలా కథలు రాశాం. ఉద్యోగంలో బదిలీల కారణంగా ఆ అలవాటుకు బ్రేక్‌ పడింది.
 
అదే నా కలం పేరు..
నేను కథలు కొనసాగించాను. చదువును కూడా. ఎంఏ చేశా. ఇన్సూరెన్సులో ఫెలోషిప్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్, జర్నలిజం వంటి ఇతర అంశాల్లో డిప్లొమాలు సాధించాను. జీవిత బీమా సంస్థలో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి జనరల్‌ మేనేజర్‌గా 2002లో రిటైరయ్యా. రచనా వ్యాసంగం కొనసాగిస్తూ 12 కథాసంపుటాలు, ఏడు నవలలు, ఆ విమర్శనాత్మకమైన వ్యాస సంపుటాలు, ఒక సాహిత్య కదంబం, ఐదు కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథాకావ్యం – పుస్తకాల రూపంలో వచ్చాయి. తెలుగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోనూ 300కు పైగా నా రచనలు ప్రచురితమయ్యాయి. చిన్నతనంలో భాగవతంలోని పద్యాలను చదివేటపుడు, ‘హారికి నందగోకుల విహారికి’ అన్న పంక్తుల్లోని విహారి పదం నాకెంతో నచ్చింది. అదే నా కలం పేరైంది.
 
నేటి సాహిత్యం..
ఆధునిక జీవితంలోని పరిణామాలను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారు. ప్రపంచీకరణ పరిణామం అనివార్యం. దాన్ని వెనక్కి తిప్పలేం. వీటిని సానుకూలంగా, సమదృష్టితో కాకుండా కొందరు వ్యతిరేక దృష్టితో చూస్తున్నారు. ప్రపంచీకరణ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే మరోవైపు వ్యతిరేకతతో రాస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో గతాన్ని వర్తమానంగా భావిస్తూ రాస్తున్నారు. కొందరు ఏహ్యభావంతో రాస్తుంటే మరికొందరు ఏ విలువలు ప్రతిపాదిస్తున్నారో? ఎందుకు  రాస్తున్నారో తెలియని గందరగోళంలో పడుతున్నారు. మన జీవితాలను సాహిత్యంలో సమకాలీనం చేస్తూ రాయాలి. అలాగే మూస ఇతివృత్తాల నుంచి  బయటపడాలనేది నా అభిప్రాయం.  
 
పురస్కారాలు.. సత్కారాలు ఎన్నో..
స్పృహ, గోరంతదీపం, గుండెలో కోయిల, అమ్మపేరు చీకటి, కొత్తనీరు వంటి కథా సంపుటాలు, చలనం, కలంకన్ను కవితా సంపుటాలు, సమీక్ష, కథాకృతి వీక్షణం అనే వ్యాస సంపుటాలు విమర్శకుల ప్రశంసలు  అందుకున్నాయి. ‘పళ్లచక్రం’ కథా సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దీపావళి కథల పోటీలో  ఆంధ్రపత్రిక నుంచి వరుసగా ఐదేళ్లు ఉత్తమ కథ బహుమతి అందుకున్నా. పురస్కారాలు, సత్కారాలు ఎన్నో.. వివిధ పత్రికల్లో పరిచయాలు– పరామర్శలు, బతుకు గీతలు, కథావిహారం వంటి శీర్షికలనూ నిర్వహించా. నా రచనలపై ఉస్మానియా, ఇతర యూనివర్శిటీల్లో పరిశోధనలు జరిగాయి. రామాయణంపై జరుగుతున్నాయి.

Advertisement
Advertisement