‘బాహుతల్లి’కి వందనం | Sakshi
Sakshi News home page

‘బాహుతల్లి’కి వందనం

Published Sat, Apr 30 2016 7:40 AM

‘బాహుతల్లి’కి వందనం - Sakshi

♦ జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత
♦ ‘సాక్షి’ కథనాన్ని అభినందించిన జేసీ సత్యనారాయణ
♦ రుషితకు జేసీ రూ. 20వేలు, మరో దాత రూ. ఐదువేల ఆర్థిక సాయం
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధరాతలంలోని ధన్వంతరుల కీర్తి ధన్యమయ్యేలా నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు అహర్నిశలు శ్రమించి కాపాడిన చిన్నారి రుషిత తల్లిదండ్రుల చెంతకు చేరింది. 4 నెలలుగా ఆసుపత్రి సిబ్బంది ఆలనా పాలనలో పెరిగి పెద్దదై 650 గ్రాముల నుంచి 1.60 కిలోలకు చేరిన ఈ చిన్నారి ఇప్పుడు తన ఇంటికి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ చేతులు మీదుగా ఆసుపత్రి వైద్యులు చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వైద్యుల సంరక్షణలో ప్రాణాలను పోసుకుని ఇప్పుడు స్వతంత్రంగా బతికే శక్తి కూడగట్టుకున్న చిన్నారి రుషితను చేతుల్లోకి తీసుకున్న క్షణం ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ సందర్భంగా జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ చిన్నారిని కాపాడేందుకు ఆసుపత్రి వైద్యులు చేసిన కృషిని, డాక్టర్. దామెర యాదయ్య బృందాన్ని అభినందించారు. చిన్నారి రుషిత 4 నెలల వీరోచిత ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రచురించిన ‘బాహుతల్లి’ కథనాన్ని ఆసక్తిగా చదివిన ఆయన ‘సాక్షి’కి అభినందనల వర్షం కురిపించారు. రుషితకు జేసీ.. తన వేతనం నుంచి రూ. 20 వేలు ఆర్థిక సాయంగా ప్రకటించారు. స్థానిక రైతు, మానవతా వాది చిలుక విద్యాసాగర్‌రెడ్డి కూడా చిన్నారికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చదివి పాపకు సాయం చేయాలని వచ్చానని, ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విరక్తి వైఖరి విడనాడాలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ‘సాక్షి’ ప్రచురించిన కథనాన్ని ఆసుపత్రి ఆవరణలో ఉంచడంతో చిన్నారి బంధువులు, ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు పెద్ద ఎత్తున తిలకించి చిన్నారి గురించి, ఆమె మృత్యుంజయురాలు అయ్యేందుకు జరిపిన పోరాటం గురించి చర్చించుకోవడం కనిపించింది.

 ఆసుపత్రిని సందర్శించిన వీవీపీ కమిషనర్
 జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎన్‌ఐసీ) యూనిట్‌ను శుక్రవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ (వీవీపీ) కమిషనర్ వీణాకుమారి, ఫెసిలిటీ బేస్డ్ న్యూ బోర్న్ కేర్ (ఎఫ్‌బీఎన్‌సీ) ట్రైనింగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమాసింగ్‌లు కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్‌ఐసీలో అందుతున్న సేవలను, డాక్టర్. దామెర యాదయ్య నేతృత్వంలోని ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement